● రూ.40 కోట్లతో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల భవనాలకు శంకుస్థాపన
● ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి
పాలమూరు: నగరంలోని వీరన్నపేటను విద్యాకేంద్రంగా తీర్చిదిద్దుతామని, రెండేళ్లలో అత్యాధునిక భవనాలు, వసతి గృహాలను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. వీరన్నపేటలో రూ.40 కోట్లతో మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలల భవన నిర్మాణానికి గురువారం ఎంపీ డీకే అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మైనార్టీ బాలికల పాఠశాలలను తిరిగి ప్రారంభించడానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను సమకూర్చి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును మళ్లీ కార్యరూపంలోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. ఒక్కో పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థుల చొప్పున మొత్తం 1,200 మంది బాలికలకు నాణ్యమైన విద్య అందించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. వీరన్నపేటతోపాటు పరిసర ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య చేరువ చేయాలనే ఉద్దేశంతో విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ గత ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు హడావుడిగా మంజూరు చేసినా ఎక్క డా భవనాలు నిర్మించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన గత ప్రభు త్వం ఆ నిధులను సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. ఎలాంటి వివక్ష చూపకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇస్తుందన్నారు. ఈ క్రమంలోనే అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనుల కోసం రూ.200 కోట్లు మహబూబ్‌నగర్ కార్పొరేషన్‌కు కేటాయించిందని గతంలోనూ మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ.400 కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మేయర్ మమత, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.


