హన్వాడ: తెలంగాణ రైతాంగం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఆదుకోవాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. గురువారం ఆయన మండలంలోని వేపూర్‌లో కరెంటు కోతలు, నీటి కొరతతో ఎండిన పంటలను బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కరువు ప్రాంతంగా మార్చి రైతుల బతుకులను చిన్నాభిన్నం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు నీటిని తరలిస్తూ.. ఇక్కడి రైతులను పంటలు వేయవద్దని అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కరెంటు లేక పంటలు ఎండిపోయి.. మళ్లీ ముంబాయికి వలస పోయే పరిస్థితి దాపురించిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో అధికారులతో సర్వే చేయించి.. పంట నష్టపోయిన రైతులకు ఎకరా రూ.25వేల నష్టపరిహారం అందించాలని, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండకుండా 24 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని, తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చూసి, వెంటనే రైతుబంధు, వ్యవసాయ కూలీలకు సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


