రైస్‌మిల్లులో విలువ చేసే వరిధాన్యం నిల్వ ఉంచడంతోపాటు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన ధాన్యం అందుబాటులో లేకపోవడంతో లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీ రైస్‌మిల్లుపై పోలీస్ కేసు చేసినట్లు ఎస్‌ఐ రాము తెలిపారు. సివిల్ సప్‌లై అధికారి రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ప్రభుత్వ ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా.. ఈ మిల్లుకు సంబంధించిన సుమారు 19.59 కోట్ల విలువైన ధాన్యం ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది. పలుమార్లు నోటీసులు జారీ చేసినా ధ్యానం చెల్లించకపోవడంతో సివిల్ సప్‌లై విజిలెన్స్ అధికారులు మిల్లులో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సుమారు 8,755,833 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో లేదని గుర్తించారు. ధాన్యం గల్లంతైనట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ ధాన్యం చెల్లించాల్సిన అంశంపై పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందన లేకపోవడంతో రికవరీ చర్యల్లో భాగంగా తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. సివిల్ సప్‌లై అధికారుల ఫిర్యాదు మేరకు మిల్లు యజమాని సుధాకర్‌రావుతోపాటు ఆయన భాగస్వాములపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. దర్యాప్తు చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


