● కొల్లాపూర్‌లో 14.46 సెం.మీ. వర్షపాతం నమోదు
● పొంగిపొర్లిన వాగులు, వంకలు
నార్లాపూర్
సమీపంలో
ముక్కిడిగుండం వెళ్లే రహదారిలో
పారుతున్న
చిన్న వాగు
కొల్లాపూర్: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం మధ్యరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. రాష్ట్రంలోనే అత్యధికంగా కొల్లాపూర్ మండలంలో 14.46 సెం.మీ. వర్షపాతం నమోదైంది. పెద్దకొత్తపల్లి మండలంలో 6.8 సెం.మీ. వర్షం, కోడేరులో 8.22 సెం.మీ. వర్షం కురిసింది. ఈ వానాకాలంలో భారీ వర్షం కురవడం కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇదే తొలిసారి. ఎడతెరిపి లేని వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పలుచోట్ల చెరువుల్లోకి నీరు చేరాయి. పంటపొలాల్లో వర్షపునీరు నిలిచాయి. కొల్లాపూర్‌లోని మల్లపురాజుకుంట వద్ద చెరువు నీరు రోడ్డుగుండా పారాయి. దీంతో ప్రజలు అటువైపు వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు. కొల్లాపూర్ నుంచి పెంట్లవెల్లికి వెళ్లే దారిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కుడికిళ్ల, చుక్కాయపల్లి వాగులు పొంగిపొర్లాయి. నార్లాపూర్ సమీపంలో ప్రధాన రహదారిపై ఉన్న చిన్న వాగు ప్రవహించడంతో ముక్కిడిగుండం గ్రామానికి వెళ్లే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


