● సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కూనంనేని సాంబశివరావు
అమరచింత: కమ్యూనిజంపై అవాకులు చవాకులు పేలే బూర్జువా పెట్టుబడి సిద్ధాంత రాజకీయ రంపులో మునిగి తేలుతున్న వారికి ఎర్రజెండా గొప్పతనం గురించి ఏం తెలుసని, బాధలు లేని సమాజ నిర్మాణమే ఎర్రజెండా లక్ష్యమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తగూడేం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. అమరచింత పట్టణంలో ఆదివారం నిర్వహించిన జ్యోతి సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొని మాట్లాడారు. కమ్యూనిజానికి మరణమే లేదని, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన విజయరాములు జీవిత సహచరి జ్యోతి మరణం అత్యంత బాధాకరమన్నారు. కమ్యూనిస్టులు త్యాగాలకు చిరస్మరణీయులన్నారు. దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం రాజీలేని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న మాట్లాడుతూ.. కమ్యూనిజం అజయమైందని, కమ్యూనిస్టుగా జీవించాలంటే ధైర్యం కావాలన్నారు. కమ్యూనిస్టులు దోపిడీ వర్గాలపై కవాతు నిర్వహించాలని కోరారు. అమరచింతతో తనకు ఎంతో అనుబంధం ఉందని ఇక్కడి విప్లవ చైతన్యం మరువలేనిదన్నారు. కల్తీ ఆహార పదార్థాలను తినడం ద్వారా జరిగే రోగాల గురించి తనదైన ఆటపాటల ద్వార ప్రజలకు వివరించారు. ఉత్తమ విలువల జీవితం కమ్యూనిస్టులకే సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఖాసీం అన్నారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాల నరసింహ, సైకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర నాయకులు బోస్, ఎండీ యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరసింహ, వెంకటయ్య, పయాజ్, బాలకిషన్, పరమేష్, పాలమూరు అధ్యయన వేదిక నేత రాఘవచారి, సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్ట. ఆంజనేయులు, ఖలీల్, జనజ్వాల, కౌన్సిలర్ తిరుమలేష్ తదితరులు పాల్గొన్నారు.


