బ్రహ్మోస్‌తో దేవరకద్ర అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

బ్రహ్మోస్‌తో దేవరకద్ర అభివృద్ధి

Sep 20 2026 12:57 AM | Updated on Sep 20 2026 12:57 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): బ్రహ్మోస్‌ క్షిపణి ప్రాజెక్ట్‌ దేవరకద్ర నియోజకవర్గానికి రావడం ఈ ప్రాంత అభివృద్ధికి కీలక మలుపు కానుందని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఖుష్బూగుప్తాతో కలిసి బసవాయిపల్లి, చౌదర్పల్లి, జినుగురాళ్ల గ్రామాల రైతులతో భూసేకరణ నెగోషియేషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రాజెక్ట్‌తో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకోవడంతో పాటు స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. భూములు కోల్పోతున్న రైతుల కుటుంబాలకు, ముఖ్యంగా స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధిలో ప్రాధాన్యత కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. భూసేకరణకు ఎకరాకు రూ.20 లక్షల వరకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతులతో మాట్లాడి పరిహారం, భూములకు వారు ఆశిస్తున్న ధర, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, సమస్యలు, సందేహాలు, సూచనలను తెలుసుకున్నారు. ప్రాజెక్ట్‌ తమ ప్రాంతానికి రావడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తూ భూములు ఇచ్చేందుకు సుముఖత తెలిపారు. అయితే న్యాయమైన పరిహారం అందించాలని కోరారు. భూముల్లోని బోర్లు, చెట్లు, షెడ్లు, కాంపౌండ్‌ గోడలు, ఇతర నిర్మాణాలకు నిబంధనల ప్రకారం అదనపు పరిహారం అందిస్తామన్నారు.

అన్ని అంశాలను పరిశీలిస్తాం:

కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా

రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఖుష్బూగుప్తా తెలిపారు. మార్కెట్‌ విలువకు అదనంగా పరిహారం అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఇప్పటికే 75 శాతం మంది రైతులు సమ్మతి తెలిపారని చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదించిన పరిహారం, భూసేకరణ చట్టం ప్రకారం లభించే పరిహారం, ఇతర ప్రాంతాల్లో అమలైన పరిహారాలను పరిశీలించి రైతులు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. న్యాయపరమైన ప్రక్రియకు వెళితే సమయం పట్టే అవకాశం ఉన్నందున అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భూసేకరణకు సహకరించాలని కోరారు. ప్రాజెక్ట్‌తో పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధితోపాటు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి, విద్యా అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియ, ఆర్డీఓ నవీన్‌, ఇతర అధికారులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.

భూములిచ్చే రైతులందరికీ

న్యాయమైన పరిహారం

ఎకరాకు రూ.20 లక్షల వరకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధం

75 శాతం మంది రైతుల సమ్మతి.. మిగిలినవారితో చర్చలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement