● ఆందోళనలో అన్నదాతలు..వారబందీపై ఇంకా స్పష్టత కరువు
అమరచింత: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి కేవలం 300 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుండటంతో దిగువకు నీటిని తరలించే కాల్వలకు అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. జూరాల ప్రధాన ఎడమ, కుడి కాల్వలతో పాటు సమాంతర కాల్వ, భీమా లిఫ్ట్, కోయిల్‌సాగర్, నెట్టెంపాడు, పవర్‌హౌస్‌లకు నీటి విడుదల పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.242 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. వర్షాభావ పరిస్థితులు, వేసవిలో తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటిని రిజర్వు చేయాలనే ఉద్దేశంతో కాల్వలకు సరఫరా నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో జూరాల ఆయకట్టులో సాగు చేస్తున్న రైతుల్లో ఆందోళన నెలకొంది. కుడి, ఎడమ కాల్వల పరిధిలో ఈసారి సుమారు 1.10 లక్షల ఎకరాల్లో పంటలు సాగులో ఉన్నాయి. కాల్వలకు నీటి విడుదల నిలిచిపోవడంతో పంటలకు నీరందుతుందా లేదా అన్న సందిగ్ధంలో రైతులు ఉన్నారు. ముఖ్యంగా ప్రస్తుత పంటల దశలో నీటి సరఫరా నిలిచిపోవడం తమకు ఇబ్బందికరంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై జూరాల ప్రాజెక్టు నందిమళ్ల డివిజన్ ఈఈ ప్రవీణ్‌కుమార్‌ను వివరణ కోరగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే కాల్వలకు నీటి సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు. వారబందీపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని, అధికారులతో చర్చల అనంతరం ప్రభుత్వ ఆదేశాల మేరకు సాగునీటి విడుదలపై నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నారు.


