ఖిల్లాఘనపురం: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని ప్రధాన రహదారిపై మూసి ఉన్న దాబాల్లో సోమవారం తెల్లవారుజామున దొంగతనాలు జరిగినట్లు నిర్వాహకులు, స్థానికులు తెలిపారు. దొంతికుంట తండా, సోళీపురం గ్రామాల సమీపంలోని దాబాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు చెప్పారు. సోళీపురం సమీపంలో అంజనేయులు నిర్వహిస్తున్న దాబా వెనుక ఉన్న రేకులను తొలగించి లోపలికి ప్రవేశించిన దుండగులు ఐదు కాటన్ల బీర్లు, 144 క్వార్టర్ బాటిళ్లు, 20 ఆఫ్ బాటిళ్ల విస్కీ, 50 కిలోల బియ్యం, సుమారు రూ.10 వేల విలువైన కిరాణా సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు తెలిపాడు. దొంతికుంట తండా స్టేజీ సమీపంలోని గన్యానాయక్ దాబాలో రెండు కాటన్ల బీర్లు, ఒక కాటన్ విస్కీ చోరీ అయినట్లు చెప్పారు. కొత్తపల్లి తండా సమీపంలోని విష్ణు దాబా, సోళీపురానికి చెందిన గొల్ల కాశయ్య దాబాల్లోనూ దొంగతనానికి యత్నించినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులు పేర్కొన్నారు. అయితే దాబాల్లో చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకటేష్ తెలిపారు.


