మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగరంలోని ఎంప్లాయీస్‌కాలనీలో కొత్తగా నిర్మించిన మహిళా సంఘ భవనాన్ని ఆదివారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడుతూ త్వరలోనే ఈ భవనాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడి ఆవరణలోనే ఆర్‌ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, దీని నిర్వహణ బాధ్యతలు తమకే అప్పగిస్తామన్నారు. మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పాలకులవి కార్మిక
వ్యతిరేక విధానాలు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఏళ్లుగా ప్రజా, కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రాములు ఆరోపించారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం రాజకీయ శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేట్లకు పాలకులు యథేచ్ఛగా దేశ సంపద, వనరులు దోచిపెడుతున్నారని విమర్శించారు. దీంతో అసమానతలు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర సామాజిక సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ముఖ్యంగా కనీస వేతనాలు పెరగనందున కొనుగోలు శక్తి పడిపోయి కార్మికులు, కర్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.పార్టీ నాయకులు వి.కురుమూర్తి, కిల్లె గోపాల్, లక్ష్మయ్య, వి.పద్మ, బొల్లె చంద్రకాంత్, రాజ్‌కుమార్, ప్రశాంత్ పాల్గొన్నారు.
తండా సమస్యలపై
అదనపు కలెక్టర్ ఆరా
భూత్పూర్: మండలంలోని హస్నాపూర్ గ్రామపంచాయతీ అనుబంధ గ్రామమైన పోతుగుట్టతండాలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ ఆదివారం పర్యటించి తండావాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తండాలో ప్రభుత్వ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రం, ఓటర్ల జాబితాలోని తప్పులపై వివరాలు సేకరించారు. అంగన్‌వాడీ భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్ కిషన్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ఐ వెంకటేశ్, జీపీఓ ప్రణీత్, తండావాసులు పాల్గొన్నారు.
పోలింగ్‌కేంద్రాల పరిశీలన
భూత్పూర్ (అడ్డాకుల): అడ్డాకుల మండలం శాఖాపూర్ 103,104 పోలింగ్ కేంద్రాలను, మూసాపేట మండలం జానంపేటలో అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్ల, ఎన్నికల సంబంధిత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
24న పీయూలో
ఉద్యమకారుల సమ్మేళనం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీలో ఈనెల 24న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం ఉంటుందని పీయూ ఉద్యమకారుల కమిటీ సభ్యులు అన్వర్, రాము తెలిపారు. ఈ మేరకు ఆదివారం పీయూ ఆవరణలో సమ్మేళనం వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని కళాశాలల ఉద్యమకారులు ఆ రోజు జరిగే సమ్మేళనంలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. దీనికి ముఖ్య అతిథులుగా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తదితరులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు బ్రహ్మం, శివ, కొండా గణేష్, చంద్రకాంత్‌గౌడ్, ప్రొఫెసర్ భూమయ్య, గోపాల్, సుగుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


