పల్లె ప్రగతికి ‘పక్కా’ ప్లాన్‌! | - | Sakshi
Sakshi News home page

పల్లె ప్రగతికి ‘పక్కా’ ప్లాన్‌!

Sep 11 2026 11:21 AM | Updated on Sep 11 2026 11:21 AM

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): పల్లెల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న మౌలిక వసతులు, ప్రజల అవసరాలు, భవిష్యత్‌ అభివృద్ధి అవసరాలను సమగ్రంగా గుర్తించి వచ్చే మూడేళ్లకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణ గ్రామ పంచాయతీ సమగ్ర అభివృద్ధి ప్రణాళిక (జీపీసీడీపీ)కు శ్రీకారం చుట్టింది. ప్రతి గ్రామానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి విలేజ్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేస్తున్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్‌, డ్రెయినేజీలు మొదలు సామాజిక భద్రత, మహిళా సంఘాలు, రైతులు, విద్య వంటి వందకుపైగా అంశాలను ఇందులో పొందుపరుస్తున్నారు.

అవసరమేంటి.. పనులేంటి?

గ్రామంలో ఏ సౌకర్యం ఉంది? ఏది లేదు? ఇంకా ఏం కావాలి? అనే వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేస్తున్నారు. మరుగుదొడ్లు లేని కుటుంబాలు, నల్లా కనెక్షన్లు లేని ఇళ్లు, తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలు, పాత చేతిపంపులు, మోటార్ల మరమ్మతులు, సీసీ రోడ్లు, లింక్‌ రోడ్లు, డ్రెయినేజీలు, వీధి దీపాలు తదితర అవసరాలను గుర్తిస్తున్నారు. వీటితోపాటు ఉపాధి హామీ కింద చేపట్టాల్సిన అవెన్యూ ప్లాంటేషన్‌, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులపైనా వివరాలు సేకరిస్తున్నారు.

డిజిటల్‌ గ్రామ ప్రొఫైల్‌

గ్రామ పంచాయతీకి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేయనున్నారు. దీంతో గ్రామానికి సంబంధించిన వివరాలను ప్రజలు సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.

పల్లెల ప్రగతికి ఇదే దిక్సూచి

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో మూడేళ్ల అభివద్ధి ప్రణాళిక కోసం వివరాల సేకరణ వేగంగా జరుగుతోంది. ప్రతి అంశాన్ని పక్కాగా నమోదు చేయాలని గ్రామ కార్యదర్శులకు ఆదేశాలిచ్చాం. ఇతర శాఖల ఉద్యోగులు, సర్పంచుల సహకారంతో దీనిని పూర్తి చేయాలని చెప్పాం. ఈ నివేదిక పల్లెల ప్రగతికి దిక్సూచిలా పని చేస్తుంది.

– వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీఓ

మూడేళ్లకు గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రణాళిక

2026–29 లక్ష్యంగా జీపీసీడీపీ రూపకల్పన

వందకుపైగా అంశాలపై క్షేత్రస్థాయి వివరాల సేకరణ

అవసరాల గుర్తింపు.. ప్రాధాన్యతల వారీగా అభివృద్ధి పనులు

ప్రతి గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్‌.. ఒక్క క్లిక్‌తో పూర్తి సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement