ఉప్పునుంతల: నాటుసారా తయారీకి ఉపయోగించే నిషేధిత నల్లబెల్లం, పటికను అక్రమంగా తరలిస్తున్న మినీలారీని పోలీసులు పట్టుకున్నారు. నాగర్‌కరూన్ల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని శ్రీశైలం–హైదరాబాద్ ప్రధాన రహదారిపై వెల్టూరు స్టేజీ సమీపంలో ఆదివారం వాహన తనిఖీలు చేపట్టగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులను గమనించిన డ్రైవర్ వాహనాన్ని పొలాల్లోకి మళ్లించి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లాడు. పోలీసులు వెంబడించడంతో వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. పోలీసులు మినీలారీని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 21 క్వింటాళ్ల నల్లబెల్లం, రెండు కిలోల పటిక లభించింది. పరారైన డ్రైవర్‌ను నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి బాపూజీనగర్‌కు చెందిన అల్లకుంట శంకర్‌గా గుర్తించినట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్‌గౌడ్ తెలిపారు. వాహన యజమాని అదే గ్రామానికి చెందిన పిట్ల రాజాపై కూడా కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. ఉప్పునుంతల మండలంలోని తండాలు, గ్రామాల్లో విక్రయించేందుకు వీటిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని ఎస్‌ఐ తెలిపారు.
● పోలీసులను చూసి మినీలారీని పొలాల్లోకి తీసుకెళ్లిన వైనం
● డ్రైవర్ పరారీ.. వాహనం
యజమానిపైనా కేసు


