● నీటికుంటలో పడి పెద్ద కుమారుడు మృతి
● గతంలో రోడ్డు ప్రమాదంలో
చిన్న కుమారుడు దుర్మరణం
● రెండు నెలల వ్యవధిలో
ఇద్దరిని కోల్పోయిన వైనం
మిడ్జిల్: చస్తే కాశీలో చావాలి.. లేదా కన్న కొడుకు ఒడిలో మృతి చెందాలి అనుకుంటారు తల్లిదండ్రులు. అలాంటిది కన్న కొడుకులకు ఆ తల్లి తలకొరివి పెట్టాల్సిన దురదృష్టం ఆమెను వెంటాడుతుంది. గతంలో భర్తను కోల్పోయిన ఆ తల్లి రెండు నెలల వ్యవధిలో ఇద్దరు కొడుకులకు అంత్యక్రియలు చేసిన మండలంలోని మసిగొండ్లపల్లిలో జరిగింది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మణెమ్మకు ఇద్దరు కుమారులు వడ్ల శ్రీనివాసులు(43), రాజేందర్(40) ఉన్నారు. ఈ ఏడాది జూన్ 28న మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజేందర్ మృతి చెందగా అదే ప్రమాదంలో శ్రీనివాసులు ఆస్సత్రిలో చికిత్స పొందుతుండగా మణేమ్మ చిన్న కుమారుడు రాజేందర్‌కు అంత్యక్రియలు పూర్తి చేసేంది. తాజాగా ఆదివారం పెద్ద కుమారుడు శ్రీనివాసులు గ్రామ సమీపంలోని పొలంలో ఏర్పాటు చేసిన నీటి కుంటలో స్నానానికి దిగి ప్రమాదశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. ఇద్దరు కుమారులకు మూడు, మూడు పెళ్లిళ్లు చేసినా వారి భార్యలు గతంలోనే వదిలి వెళ్లడంతో ఆదివారం పెద్ద కుమారుడు శ్రీను మృతి చెందగా ఆమెనే తలకొరివి పెట్టాల్సి వచ్చింది. ఇద్దరు కొడుకులు తనకు ఆసరాగా ఉంటారు అనుకుంటే 65 రోజుల వ్యవధిలో ఇద్దరిని కోల్పోయి మణెమ్మ అనాథగా మిగిలింది.


