జడ్చర్ల టౌన్: గంగాపురం వాసి, జడ్చర్ల కేంద్రంగా అమెచ్యూర్ స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ లో శిక్షణ పొందుతున్న మాస్టర్ కేశవ్‌గౌడ్‌కు ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది. హైదరాబాద్ రామకోటిలోని తెలంగా ణ సారస్వత పరిషత్ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ‘గ్లోబల్ ఎక్స్‌లెన్స్ ఐకాన్ అవార్డ్స్–2026’ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన 400 మందిని ఒకే వేదికపై సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని అసాధారణ విజయంగా గుర్తిస్తూ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు చేశారు. ఈ సందర్భంగా కేశవ్‌గౌడ్‌ను జీనియస్ బుక్ సౌత్ ఇండియా కోఆర్డినేటర్ రవీందర్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేందర్‌గౌడ్ తదితరులు సత్కరించారు. కేశవ్‌గౌడ్‌కు రికార్డులో చోటు దక్కడంపై గంగాపురం వాసులు, జడ్చర్లలోని కరాటే సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు.


