● రోడ్లపైకి వస్తే ప్రభుత్వాన్ని
స్తంభింపజేస్తాం
● ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక
అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్
వనపర్తి టౌన్: వనపర్తిలో ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలికేందుకు దళిత, బహుజన, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని ధర్మసమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి కర్మగుడి వద్ద నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. అగ్రవర్ణాలు పార్టీలకు అతీతంగా ఏకమవుతున్నప్పుడు దళితులు, బడుగు బహుజనులు, గిరిజనులు ఎందుకు ఏకం కాకూడదని ప్రశ్నించారు. రాజ్యాధికారంలో ప్రతి సామాజిక వర్గానికి సమాన హక్కు, భాగస్వామ్యం ఉండాలని అన్నారు. రాష్ట్రంలో 12 శాతం ఉన్న దళితులు ఐక్యంగా ఉద్యమిస్తే ప్రభుత్వం స్తంభించిపోతుందని పేర్కొన్నారు. ప్రతి కులానికీ గొప్ప చారిత్రక నేపథ్యం ఉందని, ముదిరాజులు, పద్మశాలీలు, విశ్వబ్రాహ్మణులు, గిరిజనులు, దళితులు తమ చరిత్రపై గర్వపడాలని సూచించారు. దళితులు పార్టీలకు అతీతంగా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు వాడల కురుమన్న, అనంతరాజు, పులిభీముడు, గట్టయ్య, రామకృష్ణ, సూర్యప్రకాశ్, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు.


