● నగలు, డబ్బులు ఇవ్వాలని బెదిరింపు..
● కేకలు వేయడంతో మహిళపై దాడి చేసి పరారీ
ఆత్మకూర్: పట్టణంలోని సంజీవ్‌నగర్ కాలనీలో ఇంట్లో ఒంటరిగా ఉన్న షమీమ్‌పై గుర్తుతెలియని మహిళ కత్తితో దాడి చేసి పరారైన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. బురఖా ధరించిన మహిళ ఇంటి తలుపు తట్టడంతో షమీమ్ తలుపు తీయగా లోపలికి ప్రవేశించింది. అనంతరం తలుపు మూసివేసి నగలు, డబ్బులు ఇవ్వాలని, లేదంటే కత్తితో చంపేస్తానని బెదిరించింది. తన వద్ద ఏమీ లేవని, వెళ్లిపోవాలని షమీమ్ వేడుకున్నట్లు తెలిపింది. ఈ క్రమంలో షమీమ్ ఒక్కసారిగా కేకలు వేయడంతో ఆ మహిళ కత్తితో ఆమె మెడపై దాడి చేసి అక్కడి నుంచి పరారైంది. వెంటనే బయటకు వచ్చిన షమీమ్ ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నట్లు భర్త సాజీద్ తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై జయన్న తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.


