చిరుతల అలజడి | - | Sakshi
Sakshi News home page

చిరుతల అలజడి

Sep 10 2026 1:15 AM | Updated on Sep 10 2026 1:15 AM

రాత్రివేళ పొలాలకు వెళ్లాలంటే జంకుతున్న జనం

బలవుతున్న మూగజీవాలు,అధికారుల మూగనోములు

బోను ఏర్పాటులో అధికారుల తీవ్ర నిర్లక్ష్యం

ఆందోళనలు చేపడతాం

చుట్టుపక్కల నాలుగైదు గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పశువులు చనిపోవడంతో ఆర్థికంగా నష్టపోవడంతోపాటు భయంతో జంకుతున్నారు. చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా అటవీ అధికారులకు ఇచ్చాం. అయినా వారిలో కనీస స్పందన లేదు. శనివారం మహమ్మదాబాద్‌ ఫారెస్టు కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ఆందోళన చేపడతాం.

– నాగేంద్రమ్మ, సర్పంచ్‌, మన్సూర్‌పల్లి

ఉన్నతాధికారులకుసమాచారం ఇస్తున్నాం

ఘటన జరిగిన ప్రతిసారి ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తున్నాం. బోను ఏర్పాటు మా పరిధిలో లేదు. ప్రతిసారి నివేదికలు పంపుతూనే ఉన్నాం. సోమవారం మరోమారు ఉన్నతాధికారులను సంప్రదిస్తాం. త్వరలోనే బోను ఏర్పాటు చేసేలా చూస్తాం. – అబ్దుల్‌ హై,

ఫారెస్టు రేంజర్‌, మహమ్మదాబాద్‌

గండేడ్‌: ఒక్కటి కాదు రెండు ఏకంగా ఆగస్టునెలలోనే ఐదు పశువులు చిరుతల విందుకు బలయ్యాయి. దాదాపు ఏడాదిపాటు ఈ తంతు కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం మూగనోము వీడడంలేదు. మండలంలోని కొండాపూర్‌కు చెందిన రైతు పకిరప్ప మేకలు మేపడానికిగాను బొందెగట్టు ప్రాంతానికి వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో మేకలు మేస్తుండగా.. అతను దాహం తీర్చుడానికి కిందికి వచ్చాడు. తిరిగి పైకి వెళ్లేసరికి అందులో మూడు మేకలు కనిపించలేదు. వాటి కోసం వెతకగా కొద్ది దూరంలో అవి చనిపోయి ఉన్నాయి. అతను అక్కడికి వెళ్లిన సమయంలో చనిపోయిన మేకను అతని కళ్లముందే వేరేచోటికి లాక్కెళ్లింది. గ్రామానికి గొల్ల చిన్న వెంకటయ్య గ్రామ సమీపాన రాజగొండ వద్ద ఉన్న ఇతని పొలంలో పాలకోసం రెండు ఆవులు వ్యవసాయం కోసం రెండు ఎడ్లు పెట్టుకున్నాడు. ఎప్పటిలాగే 20రోజుల క్రితం మేత మేపిన పశువులను సాయంత్రం పాకలో కట్టేసి ఇంటికి వచ్చేశాడు. అతను ఉదయం యథావిధిగా తిరిగి పొలానికి వెళ్లి చూడగా.. లేగదూడ చనిపోయింది. తాజాగా ఆదివారం రాత్రి రెడ్డిపల్లికి చెందిన బోడి రామయ్య ఆవుదూడ చిరుత ఆకలికి బలైంది. ఇలా ఇటీవల రెగ్యులర్‌గా పశువులు చిరుతలకు విందవ్వగా.. రైతుకు మాత్రం కన్నీరు మిగులుతున్నది.

చిరుతలెన్ని..?

మండలంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న చిరుత దాడులను బట్టి చూస్తే చిరుతల సంఖ్యపై అనుమానం తలెత్తున్నది. మొదట్లో బొందెగట్టు ప్రాంతంలో మూడు చిరుతలు మాత్రమే రైతుల కంటపడ్డాయి. కాని ఇవి మూడుకు బదులు ఎక్కువగా ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి. బొందెగట్టు బండరాళ్లలో గుహల మాదిరిగా చిరుతల ఆవాసానికి అనువుగా ఉన్నాయి. దీనికి తోడు చుట్టు పక్కల చెరువులు, కుంటలు ఉండడంతో నీటి వసతి కూడా వీటికి మరింత అనుకూలంగా ఉంది. దీనికితోడు హన్వాడ మండలం ఎల్లంబాయి తండా ప్రాంతంలో కూడా చిరుత దాడులు జరగడంతో చిరుతలు ఆరువరకు ఉన్నాయని పలు గ్రామాల రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే ఆదేశించినా..

చిరుతదాడుల విషయం ఆయా గ్రామాల సర్పంచులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు సర్పంచులు అటవీ అధికారులకు లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. చిరుతలను పట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతామని హెచ్చరించినా.. అటవీ అధికారులు పెడచెవిన పెడుతున్నారు. చివరకు ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తక్షణమే బోను ఏర్పాటు చేసి చిరుతలను పట్టాలని కోరినా.. అధికారుల్లో ఏమాత్రం చలనం లేదు. ఈ ఏడాది మార్చి 23వ తేదీన బొందెగట్టుపై మూడు చిరుతలు కనిపించాయి. ఫారెస్టు డివిజనల్‌ అధికారి గణేష్‌ వచ్చి ఘటనా స్థలాన్ని సందర్శించి చిరుతలకు అది అనువైన ప్రదేశమని చెప్పారు. వాటిని పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఉన్నతాధికారుల అనుమతులు తీసుకొని బోను ఏర్పాటు చేస్తామని చెప్పినా.. ఇప్పటి వరకు ఎలాంటి ఉలుకూపలుకులేదు. ఘటన జరిగినప్పుడు రావడం పరిశీలించడం వెళ్లడం తప్పా.. చర్యలు తీసుకోవడంలో అటవీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement