సీటుంది.. వసతి లేదు! | - | Sakshi
Sakshi News home page

సీటుంది.. వసతి లేదు!

Aug 19 2026 12:48 AM | Updated on Aug 19 2026 12:48 AM

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పీయూలో సీటు సాధించాలన్న విద్యార్థుల కల.. హాస్టల్‌ వసతి లేక చెదిరిపోతోంది. ఎప్‌సెట్‌, లాసెట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో పోటీపడి సీట్లు సాధించినా.. వసతి సౌకర్యం లేదన్న కారణంతో పలువురు అడ్మిషన్లు రద్దు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విద్యార్థులు ప్రైవేట్‌ హాస్టళ్లు, రూముల్లో ఉండేందుకు నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు వెచ్చించాల్సి వస్తుండటంతో వెనకడుగు వేస్తున్నారు. ఈ కారణంగానే లా, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో రెండు సంవత్సరాలుగా 159 సీట్లు ఖాళీగా మిగిలినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే ఉన్న హాస్టళ్లలోనూ సామర్థ్యానికి మించి విద్యార్థులను ఉంచుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో కొత్త హాస్టళ్లు పూర్తయ్యే వరకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు.

లా, ఇంజినీరింగ్‌లో సీట్లు ఖాళీ

లా కళాశాలలో గతేడాది ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులకు 140 సీట్లకు రెండు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించగా 97 మంది చేరారు. 43 మంది సీట్లను రద్దు చేసుకున్నారు. ఈ ఏడాది ఎల్‌ఎల్‌బీలో 120 సీట్లకు 67 మంది మాత్రమే చేరగా.. 53 మంది సీట్లు వదులుకున్నారు. ఖాళీ సీట్ల భర్తీకి ఈ నెల 19, 20 తేదీల్లో మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంజినీరింగ్‌లో ఈ ఏడాది పలు దశల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించినా 180 సీట్లకు 125 మంది మాత్రమే చేరారు. 55 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఇందులో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌లో 23, డేటా సైన్స్‌లో 35, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–మెషిన్‌ లెర్నింగ్‌లో 5 సీట్లు ఉన్నాయి. వీటిలో హాస్టల్‌ వసతి లేని కారణంగా, ముఖ్యంగా బాలికలు సీట్లు రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్‌ అడ్మిషన్లకు అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే స్పాట్‌ అడ్మిషన్లలో చేరే విద్యార్థులకు ప్రభుత్వ స్కాలర్‌షిప్‌ అందే అవకాశం ఉండదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చాలా ఖర్చవుతోంది

యూనివర్సిటీలో సీటు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్టల్‌ లేకపోవడంతో బయట రూమ్‌ లేదా ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉండాల్సి వస్తోంది. దీనికి నెలనెలా చాలా ఖర్చవుతోంది. యూనివర్సిటీకి వచ్చి వెళ్లేందుకు కూడా అదనపు వ్యయం అవుతోంది. హాస్టల్‌ సదుపాయం కల్పించాలని గతంలో వీసీతోపాటు పలువురు అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదు.

– రాజ్‌కుమార్‌, జగిత్యాల

వసతి కల్పించాలి

లా, ఇంజినీరింగ్‌ విద్యార్థులకు వెంటనే హాస్టల్‌ సదుపాయం కల్పించాలి. బయట రూమ్‌లో ఉంటే అద్దె, భోజనం, రాకపోకల ఖర్చులు కలిపి నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతోంది. హాస్టల్‌ సదుపాయం ఉంటే ఈ భారం తగ్గుతుంది. ఈ ఏడాదైనా ప్రత్యామ్నాయ వసతి కల్పిస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయి.

– చిరంజీవి, జగిత్యాల

ప్రత్యామ్నాయానికి ప్రయత్నించాం

పీయూ సమీపంలోని ప్రభుత్వ భవనాల్లో ప్రత్యామ్నాయంగా హాస్టల్‌ ఏర్పాటు చేసేందుకు గతంలో ప్రయత్నించాం. అయితే జిల్లా అధికారులు ఆ భవనాలను మరో ప్రభుత్వ పాఠశాలకు కేటాయించారు. ప్రస్తుతం ప్రత్యామ్నాయ హాస్టల్‌ ఏర్పాటు చేసే అవకాశం లేకపోవడంతో వసతి కల్పించలేకపోతున్నాం. యూనివర్సిటీలో కొత్త హాస్టళ్ల నిర్మాణం కొనసాగుతోంది. త్వరలోనే అవి పూర్తవుతాయి. ప్రస్తుతం మిగిలిన సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

– రమేష్‌బాబు, పీయూ రిజిస్ట్రార్‌

ప్రత్యామ్నాయం చూపరా?

కొత్త హాస్టల్‌ భవనాల నిర్మాణం కొనసాగుతున్న నేపథ్యంలో అవి పూర్తయ్యే వరకు విద్యార్థులకు ప్రత్యామ్నాయ వసతి కల్పించాలని డిమాండ్‌ వినిపిస్తోంది. గతంలో హాస్టల్‌ భవనం అందుబాటులో లేని సమయంలో అప్పటి వీసీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ చొరవతో జిల్లా కలెక్టర్‌ అనుమతితో సమీపంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలను హాస్టల్‌గా వినియోగించిన విషయాన్ని విద్యార్థులు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం పీయూ గెస్టుహౌస్‌తోపాటు పరిసరాల్లోని కొన్ని ప్రభుత్వ భవనాలు ఖాళీగా ఉన్నప్పటికీ.. వాటిని ప్రత్యామ్నాయ వసతిగా వినియోగించే ప్రయత్నం జరగడం లేదని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పీయూలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాలని పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని లా కళాశాల విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ప్రతిరోజూ తరగతులకు హాజరు కావడం తప్పనిసరి అయినప్పుడు వసతి లేకుండా ఎలా చదువుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రైవేట్‌ హాస్టల్‌ లేదా రూములో ఉంటే నెలకు రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు అదనపు భారం పడుతోందని పేర్కొంటున్నారు.

680 మంది సామర్థ్యం..

870 మంది

పీయూలోని బాలికల హాస్టల్‌ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. 680 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం సుమారు 870 మంది ఉంటున్నట్లు సమాచారం. అంటే సామర్థ్యానికి మించి 190 మందికిపైగా అదనంగా ఉంటున్నారు. ఒక్కో గదిలో నలుగురు ఉండాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆరు నుంచి ఏడుగురు వరకు ఉంటున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో ఉన్న హాస్టళ్లపైనా ఒత్తిడి పెరుగుతోంది.

పీయూలో హాస్టల్‌ సమస్యతో విద్యార్థుల వెనకడుగు

లా, ఇంజినీరింగ్‌లో 159 సీట్లు ఖాళీ.. ఏటా ఇదే పరిస్థితి

ప్రైవేట్‌ హాస్టళ్లు, రూములకు నెలకు

రూ.6 వేల నుంచి రూ.8 వేల భారం

బాలికల హాస్టల్‌లో సామర్థ్యానికి మించి 200 మందికిపైగా

ప్రత్యామ్నాయాలపై అధికారుల చొరవ కరవు

నిర్మాణంలో కొత్త హాస్టళ్లు.. అప్పటివరకు అవస్థలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement