● పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలి
● బాలానగర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ జానకి
రాజాపూర్ బాలానగర్): శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్పీ జానకి సూచించారు. మంగళవారం బాలానగర్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆమె.. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, ఫిర్యాదుల స్వీకరణ, బీట్ వ్యవస్థ, రాత్రి గస్తీ తదితర అంశాలను పరిశీలించారు. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డితో స్టేషన్ పరిధిలోని పరిస్థితులపై సమీక్షించిన ఎస్పీ.. ప్రజల ఫిర్యాదులపై సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించడంతో పాటు కోర్టు కేసుల్లో సమర్థవంతమైన ఫాలోఅప్ కొనసాగించాలని సూచించారు. మండలకేంద్రంలో జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అధిక వేగం, ఇతర ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. జడ్చర్ల రూరల్ సీఐ మహేష్, తదితరులు పాల్గొన్నారు.


