జాతీయ సెమినార్ ముగింపులో పాలమూరు యూనివర్సిటీ సిబ్బంది
అచ్చంపేట: చుట్టూ దట్టమైన అడవులు.. రాళ్లు, రప్పలతో నిండిన దారులు.. కారు చీకట్లో నెగడి కట్టెల మంటలే దీపపుకాంతులు.. బొడ్డుగుడిసెల్లో జీవనం.. పండ్లు, దుంపలే ఆహారం.. వాగుల నీరే శుద్ధజలం.. ఇదీ నల్లమలలో జీవిస్తున్న చెంచుల పరిస్థితి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. 80 ఏళ్లు గడుస్తున్నా.. కూడు, గూడు, విద్య, వైద్యానికి నోచుకోక.. క్రూరమృగాలు, విషపు పురుగుల మధ్య సహవాసం చేస్తూ.. దయనీయ స్థితిలో దుర్భర జీవనం గడుపుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎందరు అధికారులకు మొరపెట్టుకున్నా.. ఎంత మంది ప్రజాప్రతినిధులు హామీలిచ్చినా.. నేటికీ వీరి జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేకపోతోంది.
పడిపోతున్న జీవన ప్రమాణాలు
చెంచుల జీవన ప్రమాణాలు వేగంగా పడిపోతున్నా యి. సింహభాగం చెంచులు పౌష్టికాహారం లోపంతో బాధపడుతున్నారు. వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉండి అనేక రకాల వ్యాధులకు గురువుతున్నారు. రక్తహీనత, టీబీ, మలేరియా, విషజ్వరాలు, క్యాన్సర్, కడుపులో బల్ల (గడ్డ) వ్యాధులు లేని కుటుంబం అంటూ లేదు. పోషకాహారం లోపంతో మహిళలు, చిన్నారులు మృత్యువాత పడుతున్నా రు. వీరి సగటు జీవితకాలం 40 ఏళ్లు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కారణంగా చెంచుల జనాభా క్రమంగా తగ్గిపోతుంది. పెంటల్లో 14 ఏళ్లలోపే పెళ్లిళ్లు చేస్తుండగా.. 30 ఏళ్లు వచ్చే సరికి ఐదారుగురు పిల్లలకు జన్మనిస్తున్నారు. మహిళలు అనారోగ్యం పాలవడానికి ఇదే ప్రధాన కారణం. చెంచుల్లో ఎక్కువ మంది ఆహారం తీసుకో కుండా అడవుల్లో దొరికే పండ్లు తింటారు. మరికొందరు ఆహారం లేకుండా మద్యం తాగి.. అనారోగ్యాలను బారినపడుతున్నారు. తిండిలేకపోయినా రో జుల తరబడి ఉంటారు తప్ప సారా లేనిది ఒక్క రోజు కూడా ఉండలేకపోతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే చెంచుల మనుగడ ప్రశ్నార్థకంగా మార నుంది. జీవనశైలిపై అవగాహన కల్పించే వారు లేక పోవడం, పౌష్టికాహార లోపం, రకరకాల వ్యాధు లు, బాల్యవివాహాలు తదితర కారణాలతో అడవి బిడ్డల రోదన.. అరణ్యవేదనగా మిగిలిపోతోంది.
అభివృద్ధికి దూరంగా..
అటవీ ఉత్పత్తుల సేకరణే వీరి ప్రధాన జీవనాధారం. వీటి ద్వారానే జీవనం సాగిస్తున్నారు. ఉమ్మడి ఏపీలో మినహాయిస్తే.. చెంచుల అభివృద్ధి, సంక్షేమం కోసం బడ్జెట్‌లో నిధుల కేటాయింపు లేవు. తెలంగాణ వచ్చాక కూడా ఐటీడీఏ కార్యకలాపాలు తగ్గిపోయాయి. ఈ క్రమంలో చెంచుల సమస్యల కోసం పాదయాత్రలు, ధర్నాలు, నిరాహార దీక్షలు చేసినా ఫలితం లేకపోయింది. అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల పరిధిలోని లోతట్టు అటవీ ప్రాంతం ఫర్హాబాద్, మల్లాపూర్, పుల్లాయిపల్లి, రాంపూర్, అప్పాపూర్, భౌరాపూర్, ఈర్లపెంట, మేడిమెల్కల, సంగడిగుండాలు, ధారవాగు, తాటిగుండాలు, పెద్దూటి, బట్టిచింతల, ఎంకలపెంట, ఎర్రపెంట, పాత ధారారం, కుండిచింతబైలు, కండ్లకుంట, గీచుగండి, ఆగర్లపెంట, పందిబొర్రె పెంటల్లో నివసించే వారి పరిస్థితి దుర్భరంగా మారింది.
భౌరాపూర్‌లో చెంచుల బొడ్డు గుడిసెలు.. రాంపూర్ చెంచుపెంటలో చెంచుల పిల్లలు ఇలా..
అందని వైద్యం.. చీకట్లో జీవనం
అభయారణ్యంలోని చెంచుపెంటల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం, తాగునీరు, రవాణా, విద్యుత్, ఇళ్లు లేక చెంచులు అంధకారంలో బతుకుతున్నారు. కి.మీ.,ల దూరంలో ఉన్న బావులు, కుంటలు, బోర్లు, కాల్వల వద్దకు నడిచివెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. నల్లమల పెంటల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. పలుచోట్ల సోలార్ వ్యవస్థతో విద్యుత్ దీపాలు అమర్చినా సగానికి పైగా పనిచేయడం లేదు. అయితే ఈ చెంచు పెంటలన్నీ (అప్పాపూర్) ఒకే దగ్గరికి చేర్చి వారికి విద్యుత్ సదుపాయం కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం అటవీశాఖ నిబంధనలతో నీరుగారుతోంది. రాత్రివేళ బొడ్డు గుడిసెల్లో కట్టెల మంటలు పెట్టి కాలం వెల్లదీస్తున్నారు. చెంచులకు వైద్య సేవలు అందడం లేదు. మన్ననూర్ కేంద్రంగా పనిచేసిన సంచార వైద్యశాల మూలకుబడింది. అప్పాపూర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం ఉన్నా తెరుచుకోవడం. ఫలితంగా చెంచులు అనారోగ్యం పాలైతే వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
దయనీయంగా నల్లమలచెంచుల జీవన విధానం
బొడ్డుగుడిసెల్లో సహవాసం.. పండ్లు, దుంపలే ఆహారం
కనీస వసతులకు నోచుకోని పెంటలు
నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం


