కృష్ణానదిపై మరో వారధి | - | Sakshi
Sakshi News home page

కృష్ణానదిపై మరో వారధి

Jul 29 2026 1:16 AM | Updated on Jul 29 2026 1:16 AM

నారాయణపేట/మాగనూరు: తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న కొల్పూర్‌–కొర్తికొండ బ్రిడ్జ్‌ కం బ్యారేజ్‌ నిర్మాణంలో మరోమారు కదలిక వచ్చింది. కృష్ణానదిపై ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉంది. సోమవారం రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కర్ణాటక మాజీ మంత్రి బోసు రాజుతో రాయిచూరులో భేటీ అయి ప్రాజెక్టు నిర్మాణంపై విస్తృతంగా చర్చించారు.

కొల్పూర్‌–రాయిచూర్‌ రాకపోకలు సుగమం..

బ్రిడ్జ్‌ కం బ్యారేజ్‌ నిర్మాణం పూర్తయితే తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడనుంది. కొల్పూర్‌ నుంచి టైరోడ్డు మీదుగా కొర్తికొండకు ప్రస్తుతం 29 కిలోమీటర్ల దూరం ఉండగా.. ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కేవలం 3 కిలోమీటర్లే కానుంది. అదేవిధంగా ప్రస్తుతం కొల్పూర్‌ నుంచి టైరోడ్డు మీదుగా రాయిచూరుకు 40కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉండగా.. బ్రిడ్జ్‌ కం బ్యారేజ్‌ వినియోగంలోకి వస్తే 19 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దీంతో సరిహద్దు గ్రామాల ప్రజలకు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా కావడంతో పాటు రాయిచూరుకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.

డిసెంబరులో భూమిపూజకు సన్నాహాలు?

సుమారు రూ.780 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు కం బ్యారేజ్‌ నిర్మాణ పనులకు ఈ ఏడాది డిసెంబరులో భూమిపూజ చేసి పనులు ప్రారంభించేలా భేటీలో చర్చించినట్లు సమాచారం. రెండు రాష్ట్రాలు పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఇరువురు నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే భూమిపూజ, పనుల ప్రారంభ తేదీలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

తెలంగాణ గ్రామాలకు ప్రయోజనం..

రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మాగనూరు మండలంలోని అడవి సత్యావార్‌, మందపల్లి, గజరందొడ్డి, కొల్పూర్‌, పుంజనూర్‌, పెగడబండ, చిట్యాల తదితర గ్రామాలకు సాగునీటి వసతి మెరుగుపడటంతో పాటు తాగునీటి సమస్యకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని రైతులకు సాగునీటి లభ్యత పెరిగితే వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరనుంది.

● కర్ణాటకలోని మెయిగడ్డ, చిన్నకురం, రాంపురం, వడ్డేపల్లి, యాపల్‌దిన్నె, రాళ్లదొడ్డి, అప్పదొడ్డి, మామిడిదొడ్డి, ఎర్రకుంట, సగంకుంట, కుర్తికొండ, కరివాళ్లు, గంజిపల్లి, ఇబ్రహీంపురం, హనుమానన్‌దొడ్డి, షాకోలి తదితర గ్రామాలకు సాగు, తాగునీటి ప్రయోజనాలు అందే అవకాశం ఉందని చర్చల్లో ప్రస్తావించినట్లు సమాచారం.

‘కొల్పూర్‌–కొర్తికొండ’ బ్రిడ్జ్‌ కం బ్యారేజ్‌ నిర్మాణానికి అడుగులు

కర్ణాటక మాజీ మంత్రితో మంత్రి వాకిటి భేటీ

రూ.780 కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు

డిసెంబరులో భూమిపూజకు సన్నాహాలు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement