మూడు నెలలకు ఒకేసారి.. | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలకు ఒకేసారి..

Jul 29 2026 1:16 AM | Updated on Jul 29 2026 1:16 AM

ఆగస్టులో బియ్యం పంపిణీకి అధికారుల కసరత్తు

ఈ–కేవైసీ ఉంటేనే బియ్యం అందజేత

18,326 మెట్రిక్‌ టన్నులు అవసరం

మహబూబ్‌నగర్‌ రూరల్‌: ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మరోసారి మూడు నెలల రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే ఆగస్టు, సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలలకు సంబంధించిన బియ్యం కోటాను లబ్ధిదారులకు ప్రభుత్వం ఒకేసారి ఇవ్వనుంది. దుకాణాలకు బియ్యం సరఫరా ప్రక్రియ చేపట్టారు. జిల్లాలోని 17 మండలాల పరిధిలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా ఒక్కో లబ్ధిదారుడికి 6 కిలోల చొప్పున ప్రతి నెలా 6,108.925 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈసారి మూడు నెలల బియ్యాన్ని ఒకేసారి అందించనున్న క్రమంలో ఒక్కో లబ్ధిదారుడికి 18 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు. గతంలో ప్రతినెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌షాపులు తెరిచి ఉండేవి. కానీ ఆగస్టులో మాత్రం 20 రోజులకు పైగా షాపులు తెరిచి ఉంటాయని పౌర సరఫరాలశాఖ అధికారులు తెలిపారు. ఓటీపీ, ఎస్‌ఆర్‌ఎస్‌ విధానంలో బియ్యం పంపిణీ జరుగుతుంది.

డీలర్లకు ఇబ్బందే

నెలవారీ కోటా బియ్యం సరఫరా చేయడానికే వారం నుంచి పది రోజుల సమయం పడుతుంది. అలాంటిది మూడు నెలల బియ్యం సరఫరాకు సమయం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. మూడు నెలల రేషన్‌ కోటా ఒకేసారి పంపిణీ చేసేందుకు 18,326.775 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని మూడు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్‌ దుకాణాలకు బియ్యం రవాణా చేపడుతున్నారు. కాగా మూడు నెలల రేషన్‌ కోటా బియ్యం ఒకేసారి దిగుమతి చేసుకునేందుకు స్థలం లేకపోవడంతో డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామపంచాయతీలు, ప్రభుత్వ భవనాల్లో బియ్యాన్ని భద్రపరుచుకోవాలని డీలర్లు భావిస్తున్నారు.

ఈ–కేవైసీ తప్పనిసరి

లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ–కేవైసీ రేషన్‌ షాపుల్లో పూర్తి చేసుకోవాలి. రేషన్‌కార్డులో నమోదైన ప్రతి కుటుంబసభ్యుడు తమకు కేటాయించిన షాపులకు వెళ్లి బయోమెట్రిక్‌ ద్వారా ఈ–కేవైసీ చేయించుకోవాలి. సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఈ–కేవైసీ ఉంటేనే మూడు నెలల రేషన్‌ పంపిణీపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా షాపులకు రేషన్‌ బియ్యం పంపిణీ జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement