ప్రత్యేక సూచనలు...
● సకాలంలో మందులు
పిచికారీ చేస్తేనే ప్రయోజనం
● వ్యవసాయ శాఖ ఏడీఏ రామకృష్ణ
కోస్గి: అదను, పదును చూసి వ్యవసాయం చేస్తేనే ఆశించిన స్థాయిలో పంటల దిగుబడి సాధించొచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ రామకృష్ణ తెలిపారు. పంటల విషయంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలన్నారు. ముఖ్యంగా గతంలో పత్తిపంటలో కాయ తొలుచు పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండేదని, కానీ ప్రస్తుతం రసం పీల్చే పురుగు అధికమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రసం పీల్చే పురుగుల నివారణకు సకాలంలో మందులు పిచికారీ చేస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.
పేనుబంక..
ఈ పురుగులు పంటను 20 నుంచి 25 రోజుల వయస్సులో ఆశించి రసం పీల్చి పంటను నష్టపరుస్తాయి. దీనివల్ల ఆకులు పసుపు రంగులోకి మారి ముడుచుకుపోతాయి. పురుగుల ఉధృతి బెట్ట పరిస్థితుల్లో ఎక్కువవుతుంది. ఆకాశం మేఘావృతమైనప్పుడు ఈ పురుగుల ఉధృతి వేగంగా ఉంటుంది.
తామర పురుగులు
ఈ పురుగులు సైతం పంటను 20–25 రోజుల వయస్సు నుంచి వివిధ దశల్లో ఆశించి రసం పీల్చుతాయి. దీనివల్ల ఆకు రంగు మారిపోయి మెరుస్తూ కనబడతాయి. ఆకులు ముడుచుకుపోతాయి. ఈ పురుగుల ఉధృతి కూడా బెట్ట పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది.
పచ్చదోమ.. ఈ పురుగులు పంటను 25–30 రోజుల వయస్సు నుంచి వివిధ దశల్లో ఆశించి రసం పీల్చి పంటను నష్టపరుస్తాయి. దీనివల్ల ఆకులు ఎరుపు రంగులోకి మారిపోతాయి. ఉధృతి తీవ్రమైనప్పుడు ఆకులు ముడుచుకుపోతాయి. ఈ పురుగుల ఉధృతి కూడా బెట్ట పరిస్థితుల్లోనే ఎక్కువగా ఉంటుంది.
తెల్లదోమ.. ఈ పురుగులు పంటను 25–30 రోజుల వయస్సు నుంచి వివిధ దశల్లో ఆశిస్తాయి. ఈ పురుగులు రసం పీల్చడం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారిపోతాయి. ఈ పురుగు ఉధృతి బెట్ట పరిస్థితుల్లోనే ఎక్కువగా ఉంటుంది.
నివారణ చర్యలు..
కిలో విత్తనాలకు తగినంత జిగురు కలిపి 5 గ్రాముల ఇమిడాక్లోరైడ్, 70 డబ్ల్యూఎస్ లేదా 4 గ్రాముల డయోమిథాక్సిమ్‌తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఈ రకంగా విత్తుకోవడం వల్ల 30–40 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఆశించవు.
కాండం పూత పూసే పద్ధతి
ఈ పద్ధతిలో మోనోక్రోటోఫాస్, నీరు 1:4 నిష్పత్తిలో లేదా ఇమిడాక్లోరైడ్ 200 ఎస్‌ఎల్, నీరు 1:20 నిష్పత్తిలో కలిపిన ద్రావణం విత్తిన 20, 40, 60 రోజుల్లో లేత కాండానికి పూయడం వల్ల రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. ఈ పద్ధతిలో పురుగు మందుల ఖర్చు తగ్గడమే కాకుండా వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. పంటలకు సహాయకారిగా ఉండే మిత్ర పురగులు సంరక్షించబడతాయి.
ఇమిడాక్లోరైడ్‌తో విత్తనశుద్ధి చేసిన విత్తనాలను విత్తడానికి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నానబెట్టరాదు.
రసం పీల్చే పురుగుల నివారణకు తొలిదశలో ఎక్కువసార్లు పురుగు మందు పిచికారీ చేయరాదు.
తెల్లదోమ ఉధృతి ఎక్కువగా ఉంటే పసుపురంగు డబ్బాలకు జిగురు పూసి ఉంచితే తెల్లదోమలు ఆకర్శించబడి జిగురుకు అంటుకుంటాయి.
తెల్లదోమ ఆశించినప్పుడు పైరిత్రాయట్ మందులు వాడొద్దు.


