ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ దుర్మరణం

Oct 5 2026 12:39 AM | Updated on Oct 5 2026 12:39 AM

చిన్నంబావి: ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన చిన్నంబావి మండలంలోని లక్ష్మీపల్లి స్టేజీ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని లక్ష్మీపల్లికి చెందిన సుజాతమ్మ (48) గ్రామం నుంచి కొల్లాపూర్‌ వెళ్లేందుకు బస్టాండు వద్దకు వచ్చింది. ఈ క్రమంలో చిన్నంబావి నుంచి కొల్లాపూర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రావడంతో ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో సుజాతమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదానికి బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ గ్రామస్తులు కొద్దిసేపు మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రామన్‌గౌడు ఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కొల్లాపూర్‌కు తరలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

దాడిలో గాయపడిన

వ్యక్తి మృతి

బల్మూర్‌: మండలంలోని మహాదేవపూర్‌లో గత నెల 19న జరిగిన దాడిలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామానికి చెందిన మేడిపూరి రాజేశ్వర్‌ (41)పై ఇందిరమ్మ ఇల్లు, పొలం దారి వివాదంలో దాయాదులు సెంట్రింగ్‌ కరత్రో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందినట్లు ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు. ఈ మేరకు భార్య మేడిపూరి మంజుల ఫిర్యాదుతో నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

చేపలు పట్టేందుకు వెళ్లి చెరువులో మునిగిపోయాడు..

● అనుమానాస్పదంగా ఉందంటూ కుమారుడి ఫిర్యాదు

తెలకపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందిన ఘటన తెలకపల్లి మండలంలో చోటుచేసుకుంది. మృతుడి కుమా రుడు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. కమ్మరెడ్డిపల్లికి చెందిన మోగిలి పర్వతాలు (48) వ్యవసాయం చేసు కుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య రేణుక, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇటీవల రేణుక అనారోగ్యానికి గురికావడంతో అలేరు గ్రామంలోని తల్లిగారింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఈ నెల 3న పర్వతాలు.. అదే గ్రామానికి చెందిన గోవిందు, బాషతో కలిసి రాకొండ గ్రామ శివారులోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లారు. చేపలు పడుతున్న సమయంలో పర్వతాలు నీటిలో మునిగిపోయారు. గోవిందు, బాష బయటకు తీసేలోపే ఆయన మృతి చెందాడు. అయితే తన తండ్రి మృతి అనుమానాస్పదంగా ఉందని మృతుడి పెద్ద కుమారుడు మోగిలి యాదయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement