● భోజనం వండకపోవడంతో
పస్తులున్న విద్యార్థినులు
● అస్వస్థతకు గురైన నలుగురు
ఆస్పత్రిపాలు
● పాఠశాలను సందర్శించిన
మండల అధికారులు
● కస్తూర్బాలో వరుస ఘటనలతో కలకలం
గోపాల్‌పేట: రేవల్లి కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో శనివారం మధ్యాహ్న భోజనం వండకపోవడంతో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా.. వారికి స్థానిక సీహెచ్‌సీలో చికిత్స చేయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం పాఠశాలలో వంట సిబ్బంది వంట సామగ్రిని ఇళ్లకు తీసుకెళ్తుండగా కొందరు విద్యార్థినులు వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో వంట సిబ్బంది ఆగ్రహానికి గురై మధ్యాహ్న భోజనం వండకుండా ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారం. అధికారులు ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించినా స్పందించలేదని తెలిసింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు భోజనం అందకపోవడంతో నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురై స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే వారిని సీహెచ్‌సీకి తరలించారు. చికిత్స అనంతరం తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థినులను ఇళ్లకు పంపించారు. ఘటనపై ఎంఈఓ వరప్రసాద్, ఎంపీడీఓ కీర్తన, జీసీడీఓ ఇందిరాదేవి పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. చివరికి వంట సిబ్బందికి సర్ది చెప్పడంతో.. వారు వచ్చి వంట చేయడంతో సాయంత్రం విద్యార్థులు భోజనం చేశారు. అయితే ఘటనపై ఎంఈఓ వివరణ కోరగా.. జీసీడీఓ విచారణ చేసి, నివేదిక కలెక్టర్‌కు పంపించారని, నివేదికలో ఏముందో తన కు తెలియదని పేర్కొన్నారు. కాగా.. జీసీడీఓలను ఫోన్‌లో సంప్రదించగా ఆమె స్పందించలేదు.
వరుస ఘటనలతో ఆందోళన
రేవల్లి కస్తూర్బా పాఠశాలలో నెల రోజుల క్రితం ఓ విద్యార్థినిపై ఎస్‌ఓ చేయి చేసుకోవడంతో గాయపడిన ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్దల సమక్షంలో సమస్యను పరిష్కరించినట్లు తెలిసింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే విషయంపై స్పష్టత లేదు. ఆ తర్వాత రేవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్ష రాసే ప్యాడ్‌తో ఓ బాలుడి తలపై ఉపాధ్యాయుడు కొట్టడంతో గాయమై రెండు కుట్లు పడిన ఘటన చోటుచేసుకుంది. తాజాగా కస్తూర్బాలో భోజనం అందక నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురికావడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. వరుస ఘటనలపై జిల్లా అధికారులు దృష్టి సారించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


