తిమ్మాజిపేట: కుటుంబాన్ని పోషించేవాడు అకాల మరణం చెంది దుఃఖంలో ఉన్న ఆ ఇంటిలో మానవత్వం మరిచిన ఓ అగంతకుడు దొంగతనానికి పాల్పడిన ఘటన శనివారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన గువ్వల కల్పన భర్త కృష్ణయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ క్రమంలో ఽశుక్రవారం గంగాపూర్‌లోని చెన్నకేశవస్వామి ఆలయానికి దర్శనం నిమిత్తం వెళ్లారు. శనివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇంటికి రాగా తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు అపహరించారు. బాగా తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు బాధితులు అనుమానిస్తున్నారు. కల్పన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
వనపర్తి రూరల్: మనస్తాపంతో ఫ్యాన్ ఉరేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పీర్లగుట్టకు చెందిన రాజశేఖర్ (31) కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం భార్య సంధ్యతో ఘర్షణ పడటంతో ఆమె పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని మృతి చెందాడు. మృతుడి తల్లి రామచంద్రమ్మ ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
యువకుడిపై కేసు నమోదు
బల్మూర్: పెళ్లి పేరుతో ఓ యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేందర్ శనివారం తెలిపారు. తెలకపల్లి మండలం గట్టురవిపాకలకు చెందిన గౌని శేఖర్ సోషల్ మీడియాలో మండలానికి చెందిన ఓ యువతిని పరిచయం చేసుకొని పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడని పేర్కొన్నారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


