పంటలకు ముఖ్య పోషకం నత్రజని | - | Sakshi
Sakshi News home page

పంటలకు ముఖ్య పోషకం నత్రజని

Jul 12 2026 1:47 AM | Updated on Jul 12 2026 1:47 AM

అలంపూర్‌: మనిషికి ఆహారం ఎలానో మొక్కలు కూడా ఆహారాన్ని ధాతువుల రూపంలో తీసుకుంటాయని వీటిని పోషకాలు అంటారని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జునరెడ్డి అన్నారు. మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 రకాల పోషకాలు అవసరమని పేర్కొన్నారు. పంటకు అందించాల్సిన పోషకాలపై పలు సూచనలు సలహాలు అందజేశారు.

గాలి నుంచి మొక్కలకు సహజంగా లభించే పోషకాలు : కార్బన్‌, ఆక్సిజన్‌, హైడ్రోజన్‌ ఈ మూడింటిని ప్రత్యేకంగా మొక్కలకు అందిచాల్సిన అవసరం లేదు.

ముఖ్య పోషకాలు: నత్రజని, భాస్వరం, పొటాష్‌

ఉప పోషకాలు: కాల్షియం, మెగ్నీషియం, గంధకం

సూక్ష్మ పోషకాలు: జింక్‌, రాగి, ఇనుము, మాంగనీస్‌, బోరాన్‌, మాలిబ్డినం, క్లోరిన్‌, సోడియం, కోబాల్ట్‌.

మొక్కల జీవన ప్రక్రియలో ప్రతి పోషకం ఒక ప్రత్యేక పని నిర్వర్తిస్తుంది. అది లోపించినప్పుడు ఆ పని కుంటుపడుతుంది. దీని ప్రభావం వలన దిగుబడి తగ్గుతుంది. ఒక పోషకం చేసే పని మరొక పోషకం చేయలేదు.

ముఖ్య పోషకం..

నత్రజని ఇది మొక్కకు కావాల్సిన ముఖ్య పోషకాల్లో మొదటిది. పైరుకు దీని అవసరం మొదటి నుంచి చివరి వరకు ఉంటుంది. పత్ర హరితం జీవ పదార్థం కేంద్రక ఆమ్లాల్లో నత్రజని ఒక భాగం. నత్రజనిని మొక్కలు అమ్మోనియం నైట్రేట్‌ రూపంలో తీసుకుంటాయి. నత్రజని ప్రభావం పైరు పెరుగుదల మీద దుబ్బు చేయడం, కొమ్మలు తొడగడంలోను ఉంటుంది. పైరు మీద దీని ప్రభావం స్పష్టంగాను త్వరితంగాను కనిపిస్తోంది. నత్రజని వాడకం వలన మాంసకృతుల శాతం పెరుగుతుంది. మొక్క నిర్మాణానికి మూలమైన జీవ కణమైతే జీవకణాల నిర్మాణానికి నత్రజని మూలధారం.

నత్రజని అధికంగా వాడితే :

ముఖ్యమైన నత్రజనిని అవసరం మేరకే వాడాలి. అధికంగా వేస్తే అనర్థాలకు దారి తీస్తుంది. ఎక్కువగా వాడితే పైర్లు విపరితంగా పెరిగి పడిపోవడం, పూతకు ఆలస్యంగా రావడం, పంట కాలం పొడగించడం, తాలు గింజల శాతం పెరగడం, చీడ పీడలకు సులభంగా గురికావడం, దిగుబడి తగ్గిపోతుంది.

నత్రజని లోపిస్తే :

పెరుగుదల నెమ్మదిగా, మొక్కలు పొట్టిగా ఉండిపోవడం, ఆకులు వాలిపోయి పసుపు రంగుకు మారడం, ఫలసాయంతో మాంసకృత్తుల శాతం తగ్గిపోవడం జరుగుతుంది. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకుల మొనల నుంచి మధ్య వరకు క్రమంగా మాడిపోవడం, ముదురు ఆకులు ముందుగానే పసుపు రంగుకు మారి ఎండిపోయి రాలిపోతాయి.

నత్రజని అందించే ఎరువులు:

నత్రజని అందించడానికి యూరియా, అమ్మోనియం సల్ఫేట్‌, కాల్షియం, అమ్మోనియం క్లోరైడ్‌ ఎరువులు వాడాలి. నత్రజని సులభంగా కొట్టుకపోయే స్వభావం కలది. ఈ ఎరువుల వినియోగ ఫలితం 30– 45 శాతం మాత్రమే. కాబట్టి ఈ ఎరువులు వేసే విధానంలో జాగ్రత్తలు పాటించాలి.

పాడి–పంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement