ఓటెక్కడ ఉంచుకుందాం! | - | Sakshi
Sakshi News home page

ఓటెక్కడ ఉంచుకుందాం!

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

పల్లెనా.. పట్టణమా..?

పల్లె, పట్టణాల్లో రెండు చోట్లా

ఓట్లున్న వారు తర్జనభర్జన

సర్‌ సర్వే ప్రక్రియతో ఓటర్లలో

సందిగ్ధత

వలస ఓటర్ల నమోదుకు

నేతల ఆరాటం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో ఒక్క కార్పొరేషన్‌, మూడు మున్సిపాలిటీలు, 16 మండలాలు.. ఎక్కడ చూసినా ఇప్పుడు ఒకటే చర్చ. ఈసారి ఓటు ఎక్కడ ఉంచుకుందాం? ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్‌ ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) సర్వే ఉమ్మడి కుటుంబాల్లో, ముఖ్యంగా వలస ఓటర్లలో తీవ్ర సందిగ్ధతను రేపుతోంది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల (సొంత గ్రామం, ఉద్యోగ/వ్యాపార నిమిత్తం ఉంటున్న పట్టణంలో) ఓటుహక్కు ఉండటానికి వీల్లేదని ఎన్నికల సంఘం తేల్చేసింది. ఈ నిబంధన ఇప్పుడు తలనొప్పిగా మారింది. బీఎల్‌ఓలు దాదాపు 90శాతంపైగా సర్వే ఫారాల పంపిణీ పూర్తి చేశారు. ఓటర్లు మాత్రం ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నారు. ప్రజాప్రతినిధులకు సైతం సమస్యగా మారింది.

వలస ఓటర్ల నిర్ణయంపై నేతల్లో వణుకు..

ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్‌, వార్డు మెంబర్‌, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్‌ ఎన్నికలైనా వలస ఓటర్ల ఓటింగే కీలకం. ఎన్నికల రోజు ఓటింగ్‌కు వచ్చే వలస ఓటర్లే గెలుపోటములను నిర్ణయిస్తున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 50వేల వరకు వలస ఓటర్లు ఉంటారు. గత ఎన్నికల్లో ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌, ఇతర పట్టణాల్లో ఉంటూ సరిగ్గా పోలింగ్‌ రోజు సొంతూళ్లకు వచ్చి ఓట్లు వేసి గెలుపోటములను ప్రభావితం చేశారు. ఇప్పుడు డబుల్‌ ఓట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరం కావడంతో గ్రామీణ, పట్టణ రాజకీయ నాయకులు అలర్ట్‌ అయ్యారు. మా దగ్గరే ఓటు ఉంచుకోండి అంటూ ఇటు మున్సిపల్‌ నేతలు, అటు గ్రామీణ నేతలు ఓటర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. చాలామంది ఎన్యుమరేషన్‌ ఫారం నింపి ఎక్కడ ఇవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు.

ఓటర్లు దొరకడం లేదు

ఒకవైపు ఓటర్ల సందిగ్ధత ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్న బూత్‌ లెవెల్‌ అధికారులకు కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సర్పంచ్‌, కౌన్సిలర్‌ ఎన్నికల్లో నమోదైన ఓటింగ్‌ శాతం ఆధారంగా ఫారాల పంపిణీ అయితే జరిగింది. కానీ, వాటిపై ఓటర్ల ఫోన్‌ నంబర్లు లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. అధికారులు ఇళ్లకు వెళ్లేసరికి చాలామంది వలస ఓటర్లు అక్కడ ఉండడం లేదు. కొందరైతే ఇళ్లను అమ్ముకుని వేరే ప్రాంతాలకు వలస వెళ్లారు. దీంతో ఏం చేయాలో తెలియక బీఎల్‌ఓలు ఆ ఫారాలను తమ వద్దే ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎస్‌ఐఆర్‌ ఇప్పుడు ఇంటినుంచి రాజకీయ సమస్యగా మారింది. ఉన్న ఊరిలో ఓటు లేదంటే ఎట్లాగని ఇళ్లలో కుటుంబ సమస్యగా మారుతోంది. పట్టణాల్లో నివసిస్తున్న కుటుంబాల్లో ఈ సమస్యపై భార్య భర్తల నడుమ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భర్త తమ ఓటుహక్కును గ్రామంలోనే ఉండాలని కోరుకుంటుండగా, ప్రస్తుతం ఉంటున్న పట్టణం పరిధిలోనే ఉంచుకోవాలని భార్య గట్టిగా పట్టుబడుతోన్నట్టు సమాచారం. పిల్లల చదువులు, భవిష్యత్‌ స్థానికత, రేషన్‌ కార్డులు, ప్రభుత్వ ఆఫర్లు, ఇతర సంక్షేమ పథకాలకు ఇక్కడి ఓటే కీలకమని భార్యలు వాదిస్తున్నారు. భర్తలు మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. సొంత ఊర్లో అన్నదమ్ములు, నలుగురు స్నేహితులు ఉన్నారు. ఊర్లో ఓటు తీసేస్తే చుట్టరికం, పల్లెల్లో పరువుపోతుందని ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా ప్రతి ఇంట్లోనూ పల్లె, పట్టణానికి మధ్య ఓటు యుద్ధం నడుస్తోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement