వనపర్తి రూరల్: ప్రైవేట్ ఆస్పత్రి వైద్యల నిర్లక్షంతో బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనాపురం మండలం కొన్నూరుకు చెందిన సాబేరా బేగం (35)తో పెబ్బేరు మండలంలోని వైశాఖాపూర్ గ్రామానికి చెందిన ఇమామ్‌కు 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పైళ్లె ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో ఇటీవల సాబేరాబేగం కర్నూల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. ఈ క్రమంలో ప్రతి నెల పెబ్బేరు పట్టణంలోని జననీ ప్రైవేట్ ఆస్పత్రిలో హెల్త్ చెకప్ చేయించుకునేది. గత నెల 28న రాత్రి బ్లీడింగ్ కావడంతో జననీ ఆస్పత్రిలో చేర్పించారు. అదే రోజు డా.ప్రియాంకరెడ్డి ఆమెకు ఆపరేషన్ చేయగా పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. పిల్లలకు శ్వాస సమస్య ఉండంతో వెంటనే మహబూబ్‌నగర్‌లోని సుశ్రుత ఆస్పత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అలాగే సాబేరాబేగంకు పొటాషియం నిల్వలు తగ్గగా ఈ నెల 3న మహబూబ్‌నగర్‌లోని నవోదయ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. అయితే పెబ్బేరులోని జననీ ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించకపోవడంతోనే తమ కుమార్తె చనిపోయిందని కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రి ముందు మృత దేహంతో ఆందోళన చేపట్టారు. పెద్ద మనుషులు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపి నష్టపరిహారం ఇప్పించడంతో బాధితులు ఆందోళన విరమించారు. ఈ ఘటనపై ఆస్పత్రి యజమాన్యం డాక్టర్ ప్రియాంక, జయచంద్రా రెడ్డిను వివరణ కోరగా సాబేరాబేగంకు కవలలు పుట్టడంతో బ్లీడింగ్ ఎక్కువై పోటాషియం తగ్గిందని, దానికి ఇక్కడ చికిత్స లేకపోవడంతో నిమ్స్‌కు రెఫర్ చేశామన్నారు. అయితే అక్కడ చేర్చుకోవడం ఆలస్యమవుతుందని మహబూబ్‌నగర్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు. ఇందులో తమ తప్పు ఏమిలేదన్నారు.
బాధిత కుటుంబ సభ్యుల ఆందోళన


