పాల దిగుబడికి పశువుల ఆరోగ్యరక్షణే కీలకం | - | Sakshi
Sakshi News home page

పాల దిగుబడికి పశువుల ఆరోగ్యరక్షణే కీలకం

Jul 8 2026 1:14 AM | Updated on Jul 8 2026 1:14 AM

జడ్చర్ల/జడ్చర్ల టౌన్‌: పాడి పరిశ్రమలో లాభదాయకత సాధించాలంటే పశువుల ఆరోగ్య సంరక్షణే కీలకమని పశు సంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ శివానందస్వామి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పెద్ద ఆదిరాలలో పాల ఉత్పత్తిదారుల సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పశువులకు సమతల్యమైన పోషకాహారం, పరిశుభ్రమైన తాగునీరు, పశువుల కొట్టం, వ్యాధుల నివారణకు సకాలంలో వ్యాక్సిన్‌లు క్రమం తప్పకుండా నులిపురుగుల నివారణ మందులు వంటి జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు సూచించారు. పాడిపశువులలో సాధారణంగా గాలికుంటు, గొంతువాపు తదితర అంటువ్యాధులు ఎక్కువగా ప్రభలుతాయన్నారు. ఆయా వ్యాధులబారిన పడితే గణనీయంగా పాలఉత్పత్తి పడిపోతుందని, కొన్నిసార్లు పశువులు కూడా మృత్యువాత పడే పరిస్థితి ఉంటుందన్నారు. పశువులలో జ్వరం, మేత మేయకపోవడం, నోటిలో పుండ్లు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత పశువుల డాక్టర్లను సంప్రదించాలని కోరారు. పాల దిగుబడి పెంచేందుకు దాణా, పచ్చిమేత తదితర అందించాలన్నారు. పాల సేకరణ డిప్యూటీ డైరెక్టర్‌ సత్యనారాయణ యాదవ్‌ మాట్లాడుతూ.. నాణ్యమైన పాలను సేకరణ కేంద్రాలకు తీసుకురావాలని, నాణ్యమైన పాలకు మంచి ధరలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి 15రోజులకు బిల్లులు క్రమం తప్పకుండా చెల్లిస్తామన్నారు. కార్యక్రమంలో పాల ఉత్పత్తి దారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, బీఎంసీ అధ్యక్షుడు రాంలింగారెడ్డి, పెద్దఆదిరాల సర్పంచ్‌ శ్రీనివాస్‌గౌడ్‌, చిన్నఆదిరాల సర్పంచ్‌ శ్రీశైలం, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement