సినీ ఫక్కీలో పట్టివేత
నారాయణపేట: స్టీరింగ్ పట్టి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్.. అదే చేతులతో తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడుతున్నాడు. పగలు ఉద్యోగం, రాత్రి దొంగతనం.. ఇదే అతని జీవన విధానంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన అప్పులు, చెడు అలవాట్లు కలిసి అతడిని నేరాల బాట పట్టించాయి. తాళాలు వేసిన ఇళ్లు కనిపిస్తే చాలు.. యజమానులు ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు తిరిగి వస్తారనే సమాచారాన్ని సేకరించి, సరైన సమయం చూసి చోరీలకు పాల్పడేవాడు. ఇలా నాలుగేళ్లుగా పలు జిల్లాల్లో పోలీసులకు సవాల్‌గా మారిన సీరియల్ చోర్‌ను సీని ఫక్కీలో సోమవారం కోస్గి పోలీసులు, నారాయణపేట సీసీఎస్ సంయుక్త బృందం అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ డాక్టర్ వినీత్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. గండీడ్ మండలం లింగయ్యపల్లికి చెందిన ఏదుల బాబు(42) ప్రైవేట్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం కుటుంబ అవసరాలకు సరిపోకపోవడం, అప్పుల భారం పెరగడం, చెడు అలవాట్లకు బానిస కావడంతో సులభంగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్‌గా ఎంచుకున్నాడు.
పగలే రెక్కీ... రాత్రికి ఆపరేషన్
డ్రైవర్‌గా తిరుగుతూ వివిధ గ్రామాలు, పట్టణాల్లో సంచరించే అవకాశం అతనికి కలిసొచ్చింది. ఏ ఇంటికి తాళం ఉంది.. ఎవరూ లేరు.. ఎప్పుడు వస్తారు.. అనే విషయాలను ముందుగానే గమనించేవాడు. తర్వాత రాత్రి లేదా ఎవరూ లేని సమయంలో ఇనుప రాడ్లు, ఇతర పరికరాలతో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. నగదు, బంగారం, విలువైన వస్తువులను మాత్రమే ఎత్తుకెళ్లి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయేవాడు.
బంగారం తాకట్టు.. డబ్బు మాయం
దొంగిలించిన బంగారు ఆభరణాలను నేరుగా అమ్మకుండా ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టి రుణాలు తీసుకునేవాడు. ఆ డబ్బుతో అప్పులు తీర్చడం, కుటుంబ ఖర్చులకు వాడటం, చెడు అలవాట్లకు వెచ్చించడం చేసేవాడని విచారణలో వెల్లడైంది. దీంతో చోరీ చేసిన వస్తువుల జాడను గుర్తించడం కూడా పోలీసులకు కష్టంగా మారింది.
18కేసులు.. పది ఠాణాల పరిధిలో నేరాలు
2022 నుంచి ఇప్పటి వరకు కోస్గి, కుల్కచర్ల, మరికల్, మహమ్మదాబాద్, మద్దూర్, నారాయణపేట, వికారాబాద్, దోమా, మహబూబ్‌నగర్ రూరల్, హన్వాడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 18 ఆస్తి నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఒకే తరహా మోడస్ ఆపరెండీతో వరుస చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్‌గా మారాడు.
కోస్గిలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా.. నిందితుడు వారిని చూసి అనుమానాస్పదంగా పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. సాంకేతిక ఆధారాలు, విచారణలో సేకరించిన సమాచారంతో ప్రశ్నించగా.. నేరాలను అంగీకరించాడు. అనంతరం అతని ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.6,88,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మొత్తం దొంగిలించిన నగదు రూ.10లక్షలుగా పోలీసులు గుర్తించారు. ‘ఇళ్లు, వ్యాపార సంస్థలకు నాణ్యమైన తాళాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్–100కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన కోస్గి సీఐ సైదులు, ఎస్‌ఐ పురుషోత్తం, సీసీఎస్ ఎస్‌ఐ విజయభాస్కర్‌తోపాటు కోస్గి, సీసీఎస్ పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు లింగయ్య, మహేష్ పాల్గొన్నారు.
తాళం కనిపిస్తే టార్గెట్ ఫిక్స్..
అప్పులు, చెడు అలవాట్లతోనే
నేరాల బాట
రూ.10లక్షల చోరీ
రూ.6.88 లక్షల నగదు స్వాధీనం
2022 నుంచి 18 ఆస్తి నేరాల్లో
ప్రమేయం
పది స్టేషన్లకు చుక్కలు చూపిన
సీరియల్ చోర్ అరెస్ట్


