మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: గతేడాది జిల్లాకేంద్రంలో ప్రారంభించిన బాసర ఐఐఐటీ కళాశాల నూతన క్యాంపస్ భవనాల నిర్మాణానికి సంబంధించిన సైట్ లేఅవుట్ ప్లాన్‌ను సోమవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. ఈ మేరకు 6 వేల మంది విద్యార్థులు చదువుకునే విధంగా 40 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్ నిర్మిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. క్యాంపస్ హైదరాబాద్, బెంగుళూరు హైవేకు సమీపంలో నిర్మిస్తామని, ఇందులో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అకడమిక్ బ్లాక్, పీయూసీ భవనాలు, విద్యార్థులకు హాస్టల్స్, కిచెన్, డైనింగ్ హాల్ వంటివి నిర్మించనున్నట్లు వెల్లడించారు. అలాగే విద్యార్థులకు అవసరమైన సూపర్ మార్కెట్, హెల్త్ సెంటర్, సెక్యూరిటీ బ్లాక్ వంటివి వీటిలో వస్తాయని, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఆడిటోరియం, ఓపెన్ థియేటర్, క్రీడా మైదానాలు, బాస్కెట్‌బాల్ కోర్టు, వాలీబాల్ కోర్టులను కూడా నిర్మించే ప్రతిపాదనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ క్యాంపస్ నిర్మాణం పాలమూరు విద్యారంగానికి ఒక దిశానిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఈడబ్ల్యూఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి, ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ షఫీ పాల్గొన్నారు.


