అలంపూర్: ఆధునిక వ్యవసాయంలో నాణ్యమైన విత్తనాలు అధిక దిగుబడి సాధించడానికి దోహదపడుతాయి. పెరుగుతున్న విత్తన ధరలతో రైతు కుదేలవుతున్నాడు. విత్తనాల కొనుగోలు, పురుగు, తెగుళ్ల బారి నుంచి పంటను కాపాడుకోవడం రైతుకు తలకు మించిన భారంగా మారింది. ఈ క్రమంలో విత్తన శుద్ధితో పంటసాగులో ఎదురయ్యే సమస్యలను కొంత వరకు అధికమించడానికి అవకాశం ఉందని ఏఓ నాగార్జునరెడ్డి రైతులకు సూచించారు. విత్తన శుద్ధి చేయకపోతే పంటకు తెగుళ్లు, పురుగులు ఆశించి మొక్కల సాంద్రతను, దిగుబడిని గణనీయంగా తగ్గించే ప్రమాదం ఉంది. ఖరీఫ్‌లో పంటసాగు చేస్తున్న రైతులకు విత్తన శుద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు.
లాభాలు: విత్తన శుద్ధితో మొలక శాతం పెరిగి సాంద్రత సిఫా ర్సు మేరకు ఉంటుంది. తొలి దశలో ఆశించే పురుగులు, తెగుళ్ల బారి నుంచి పంటలను కాపాడుతుంది. దీంతో మొక్క ఏపుగా పెరగడానికి అవకాశం ఉంది. చీడపీడల ఉధృతిని తగ్గించి, తర్వాత దశలో ఆశించే రసం పీల్చు పురుగులు, వైరస్ తెగుళ్ల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రైజోబియం వల్ల నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. అంతేకాక వాతవరణ కాలుష్యం తగ్గి మిత్ర పురుగులు రక్షించబతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
విత్తన శుద్ధిలో రైతులు తగు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. విత్తన శుద్ధికి సరైన మందులు ఎంపిక చే సుకోవాలి. విత్తనంలో తేమ శాతం ఎక్కువగా ఉండకుండా జాగ్రత్త పడాలి. సరైన మోతాదు మందులు వాడాలి. విత్తనం పై పొర ఊడిపోకుండా చూసుకోవాలి. అయితే విత్తన శుద్ధి చేసిన విత్తనాలను పశువుల దాణాగా వాడకూడదు.
వివిధ పంటల విత్తన శుద్ధి :
విత్తన శుద్ధికి ఒక్కొక్క పంటకు ఒక విధానం ఉంటుంది. వాటిని గమనించి రైతులు జాగ్రత్తలు పాటిస్తే ఆశించిన ఫలితాలు ఉంటాయి.
వరి: ఒక కిలో వరి విత్తనంలో ఒక గ్రామ్ కార్టింజమ్ ఒక లీటర్ నీటిలో కలిపిన ద్రావణంలో ఒక రోజు నానబెట్టాలి. ఒక రోజు మండె కట్టి నారు మడిలో చల్లడం వలన అగ్గి తెగులు, ఆకుమచ్చ, పొడ తెగుళ్లను అదుపు చేయవచ్చు.
మొక్కజొన్న: ఒక కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాస్టాన్ కలిపి శుద్ధి చేస్తే ఎండు తెగులు, కాటక తెగులు, మచ్చ తెగుళ్లను అదుపు చేయవచ్చును.
వేరుశనగ: కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజేబ్‌తో శుద్ధి చేస్తే తిక్కాకు, ఆకుమచ్చ, తుప్పు, కాంత కాళ్ల తెగుళ్ల వ్యాప్తిని అరికట్టవచ్చు.
పత్తి: బ్యాక్టీరియా వల్ల నల్లమచ్చ ఆశించే ప్రాంతాల్లో లీటర్ నీటిలో 100 మిల్లీ గ్రాముల వైంసన్ లేదా ప్లాంటామైసిన్ గాని, ఒక గ్రామ్ బ్‌లైటాన్స్ కలిపిన ద్రావణంలో శుద్ధి చేసిన విత్తనాలను 6 నుంచి 8 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఆరబెట్టుకొని విత్తుకుంటే ప్రయోజనం ఉంటుంది.
మిరప : మిరపలోని వైరస్ తెగుళ్ల నివారణకు ఒక లీటర్ నీటిలో 150 గ్రాముల ట్రై సోడియం, ఆర్థ ఫాస్సేట్‌లో ఒక కిలో మిరప విత్తనాన్ని 12 గంటలు నానబెట్టి తర్వాత చల్లటి నీటిలో కడిగి విత్తుకోవాలి. దీంతో మంచి దిగుబడి సాధించవచ్చు.
ముందస్తు జాగ్రత్తలు మంచిది
చీడపీడలు వ్యాప్తి చెందిన తర్వాత సస్యరక్షణ పద్ధతులు పాటించడం కన్నా.. వాటిని ముందుగానే విత్తన శుద్ధితో అదుపు చేసుకోవాలి. దీని వల్ల పంట నాణ్యత పెరగడమే కాకుండా అధిక దిగుబడి సాధించి ఆదాయం పొందవచ్చు
పాడి–పంట


