డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన | - | Sakshi
Sakshi News home page

డిండి కట్టమైసమ్మ ఆలయం వద్ద నిరసన

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

శ్రీశైలం రోడ్డుపై బైఠాయించి

శాలివాహనుల ధర్నా

ఆలయం హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్‌

ఉప్పునుంతల: మండలంలోని లత్తీపూర్‌ శివారు పరిధి డిండి ప్రాజెక్టు వద్ద కట్ట మైసమ్మ ఆలయం వద్ద గురువారం లత్తీపూర్‌కు చెందిన కుమ్మరి కులస్తులు రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కొంతసేపు ఆలయం ముందున్న శ్రీశైలం–హైదరాబాద్‌ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. 1947లో డిండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మైసమ్మ ఆలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి తాము పూజారులుగా వ్యవహరిస్తుండగా ఇటీవల ఆలయ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసినప్పటి నుంచి తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆలయ కమిటీలో కూడా తమకు సరైన స్థానం కల్పించకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయం వద్ద రాజకీయం చేస్తూ మమ్ములను ఆలయం వద్దకు రాకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్‌గా కుమ్మర కులస్తులను నియమించాలని, ఆలయం వద్ద పూజారులతోపాటు అన్ని హక్కులు కుమ్మరులకే దక్కాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో రాష్ట్ర కుమ్మర సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఏడుకొండలు, గౌరవ సలహాదార్లు రామచంద్రయ్య, ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు, వీరయ్య, సహాయ కార్యదర్శి శంకరయ్య, జిల్లా సంఘం అధ్యక్షుడు రఘుబాబు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్‌, ఉపాధ్యక్షులు సుల్తాన్‌, జంగయ్య, మండల సీనియర్‌ నాయకులు బాలయ్య, మల్లయ్య, రమేష్‌, అంజి, సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.

కుమ్మరి కులస్తులపై కేసు నమోదు

కట్ట మైసమ్మ ఆలయం వద్ద అన్ని హక్కులు తమకే దక్కాలని డిమాండ్‌ చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా జాతీయ రహదారిపై బైఠాయించి వాహనదారులకు ఇబ్బంది కల్గించినందున లత్తీపూర్‌కు చెందిన కుమ్మరి కులస్తులు దేవర్ల మల్లయ్య, రమేష్‌, రవి, వెంకటేష్‌, అంజనమ్మ తదితర మొత్తం 12మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పుట్ట మహేష్‌ తెలిపారు. అనుమతులు లేకుండా ధర్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్‌ఐ హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement