వనజ.. యోగాలో ఘనత | - | Sakshi
Sakshi News home page

వనజ.. యోగాలో ఘనత

Jun 9 2026 8:46 AM | Updated on Jun 9 2026 8:46 AM

చాలా సంతోషంగా ఉంది...

ప్రపంచ యోగాసన చాంపియన్‌షిప్‌లోమెరిసిన జిల్లా క్రీడాకారిణి

ట్విస్టింగ్‌ యోగాసనంలో

బంగారు పతకం కై వసం

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రానికి చెందిన వనజ యోగాలో మెరుగైన ప్రతిభ కనబరుస్తున్నారు. పోలీస్‌శాఖలో ఏఎస్‌ఐ కేడర్‌గా ఉన్న ఆమె ప్రస్తుతం అప్పా అకాడమీలో యోగా ట్రైనర్‌గా పనిచేస్తున్నారు. ఇటు ఉద్యోగ ధర్మం నిర్వరిస్తూనే యోగా, మాస్టర్స్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది వనజ. 2012లో గచ్చిబౌలిలో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్‌స్పోర్ట్స్‌ మీట్‌లో అథ్లెటిక్స్‌లో రజతం పతకం, 2014లో విశాఖపట్నంలో జరిగిన పోలీస్‌ మీట్‌లో 10 కిలోమీటర్ల నడకలో బంగారు పతకం పొందింది. అదే ఏడాది ఆదిలాబాద్‌ (బాసర)లో జరిగిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో రజతం, 2016లో కర్ణాటక (ఉడిపి)లో జరిగిన జాతీయస్థాయి యోగాలో బంగారు పతకం సొంతం చేసుకున్నారు. వైజాగ్‌లో జరిగిన పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌లో యోగాలో రజతం పొందింది. 2017 జార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలో జరిగిన ఆలిండియా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ యోగా విభాగంలో బంగారు పతకం సాధించింది. 2018 పంజాబ్‌ రాష్ట్రం పటియాలో జరిగిన జాతీయస్థాయి యోగా పోటీల్లో రజత పతకం అందుకున్నారు. 2018లో పోలీస్‌సేవ పతకాన్ని అందుకున్నారు. అదేవిధంగా 2019లో పలుసార్లు యోగా పోటీల్లో పాల్గొంది. 2023 ఏపీ రాష్ట్రంలో తాడేపల్లిగూడెంలో జరిగిన యోగా పోటీల్లో వనజ రాణించింది. గోవాలో జరిగిన ఆరో నేషనల్‌ మాస్టర్స్‌ గేమ్స్‌లో పాల్గొని బంగారు పతకం సాధించగా గచ్చిబౌలీ స్టేడియంలో పాన్‌ ఇండియా మాస్టర్స్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఫెడరేషన్‌ కప్‌ నేషనల్‌ మాస్టర్స్‌ క్రీడల్లో వనజారెడ్డి ప్రతిభచాటి 45+ ఏళ్ల విభాగంలో లాంగ్‌జంప్‌, హైజంప్‌, 800 మీటర్ల పరుగులో మూడు పతకాలు సాధించారు.

వరల్డ్‌ యోగాసనలో బంగారు పతకం

అహ్మదాబాద్‌ వేదికగా ఈనెల 3వ తేదీ నుంచి జరుగుతున్న మొదటి వరల్డ్‌ యోగాసన చాంపియన్‌షిప్‌లో వనజ పాల్గొంటున్నారు. సీనియర్‌ –సి మహిళల ట్విస్టింగ్‌ యోగాసన వ్యక్తిగత విభాగంలో ఆమె ప్రతిభ కనబరిచారు. 42.75 స్కోర్‌ సాధించి బంగారు పతకం సాధించారు. ఈ విభాగంలో 12 దేశాల క్రీడాకారిణులు పాల్గొనగా పాలమూరు క్రీడాకారిణి వనజా ప్రథమస్థానంలో నిలవడం విశేషం. వనజారెడ్డి తొలిసారిగా అంతర్జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం సాధించారు.

దేశంలో జరుగుతున్న మొదటి వరల్డ్‌ యోగాసన పోటీల్లో నేను పాల్గొనడంతో పాటు దేశానికి బంగారు పతకం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం యోగాసన క్రీడకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. వంటింటికే పరిమితం కాకుండా క్రీడల్లో రాణించి పతకాలు సాధించే సత్తా మహిళలకు ఉంది. ఇంటిపనులు చేసుకుంటూనే కొంత సమయాన్ని కేటాయించి యోగా చేస్తూ మంచి మెరుగైన ఆరోగ్యం లభిస్తుంది.యోగా విద్యను ప్రతి ఒక్కరికి అందించాలి. ముఖ్యంగా మహిళలు, బాలికలు యోగా శిక్షణ తీసుకోవాలి.

– వనజ, యోగా క్రీడాకారిణి

Advertisement
 
Advertisement
Advertisement