ఆందోళన వద్దు.. వంట గ్యాస్‌కు కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

ఆందోళన వద్దు.. వంట గ్యాస్‌కు కొరత లేదు

Mar 14 2026 8:11 AM | Updated on Mar 14 2026 8:11 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): జిల్లాలో గృహ అవసరాలకు వినియోగించే వంటగ్యాస్‌ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటారని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్యాస్‌ సరఫరా పరిస్థితిపై ఎస్పీ జానకి, అదనపు కలెక్టర్‌ జేఎల్‌బీ హరిప్రియతో కలిసి గ్యాస్‌ ఏజెన్సీల డీలర్లు, గ్యాస్‌ కంపెనీల సేల్స్‌ ఆఫీసర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఎల్‌పీజీ డీలర్ల దగ్గర బుకింగ్‌ స్టాక్‌, సరఫరాపై సమావేశంలో సమీక్షించి ప్రతి రోజు రిపోర్ట్‌ సమర్పించాలని ఆదేశించారు.జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎల్‌పీజీ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని తెలిపారు. ఆస్పత్రులు, విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు వంటి సంస్థలకు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల మేరకు సరఫరా చేయాలని సూచించారు. జిల్లాలో గృహ అవసరాల గ్యాస్‌ సిలిండర్‌ వాణిజ్య అవసరాలకు వినియోగించినా, స్టాక్‌ నిల్వ చేసినా చర్యతు తప్పవని, పౌర సరఫరాల శాఖ అధికారులు, డీటీలు, ఎస్‌ఐలతో కూడిన ఐదు బృందాలను ఏర్పాటు చేశామని, హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఎస్పీ జానకి మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న వినియోగదారులకు డెలివరీ జరగాలన్నారు. సిలిండర్‌ నిర్దేశించిన పరిణామంలో గ్యాస్‌ సరఫరా చేయాలని, తూనికల కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి గంప శ్రీనివాస్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సేల్స్‌ అధికారి సూర్య కిరణ్‌, లీగల్‌ మెట్రాలజీ అధికారి రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

అంతకుముందు రాష్ట్ర సాగు నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌ సచివాలయం నుంచి కలెక్టర్‌, ఇతర జిల్లా అధికారులతో వీసీలో మాట్లాడారు. వంట గ్యాస్‌ సరఫరా విషయంలో ఎలాంటి గందరగోళానికి గురి కావొద్దని, గృహ వినియోగదారులకు సరిపడా సరఫరా చేస్తామని భరోసా ఇచ్చారు. జిల్లాలో కలెక్టర్‌ అధ్యక్షతన ప్రత్యేక అధికారుల కమిటీ ఏర్పాటు చేసి రోజువారీ నిల్వలు, సరఫరా పరిస్థితిని సమీక్షించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement