ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి

Feb 13 2026 3:32 AM | Updated on Feb 13 2026 3:32 AM

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి

ఓట్ల లెక్కింపు పారదర్శకంగా నిర్వహించాలి

మాక్‌ కౌంటింగ్‌ ద్వారా సిబ్బందికి దిశానిర్దేశం చేసిన కలెక్టర్‌

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): ఓట్ల లెక్కింపును పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయేందిర అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సంబంధించిన కౌంటింగ్‌ సిబ్బందికి ఓట్ల లెక్కింపు ప్రక్రియపై గురువారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్‌ ట్రైనర్లు కౌంటింగ్‌ సూపర్‌వైజర్లకు, కౌంటింగ్‌ అసిస్టెంట్లకు మాక్‌ ఓట్ల లెక్కింపు శిక్షణ తరగతులు నిర్వహించి ప్రక్రియపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ సిబ్బంది ఎన్నికల నిబంధనలపై పూర్తి అవగాహనతో విధులు నిర్వహించాలని, వార్డు వారీగా ఓట్ల లెక్కింపు క్రమబద్ధంగా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో మహబూబ్‌నగర్‌ కార్పొరేషన్‌, భూత్పూర్‌, దేవరకద్ర మున్సిపాలిటీలకు సంబంధించి మూడు కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ సిబ్బంది ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 6 గంటల వరకు కేటాయించిన కౌంటింగ్‌ కేంద్రాలకు హాజరుకావాలని కలెక్టర్‌ ఆదేశించారు. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపును ప్రారంభించి, అనంతరం పోలింగ్‌ కేంద్రాల వారీగా, వార్డుల వారీగా బ్యాలెట్‌ బాక్సులను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తెరవాలని సూచించారు. ప్రతి 25 ఓట్లను ఒక కట్టగా తయారు చేసి లెక్కించాలని సూచించారు. చెల్లిన ఓట్లను మాత్రమే సంబంధిత అభ్యర్థి గుర్తు ఉన్న బాక్సుల్లో వేయాలని, చెల్లని ఓట్లను గుర్తించి ప్రకటించే పూర్తి బాధ్యత రిటర్నింగ్‌ అధికారులదేనని స్పష్టం చేశారు. మొత్తం కౌంటింగ్‌ ప్రక్రియ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలకు లోబడి పారదర్శకంగా కొనసాగాలని ఆదేశించారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, మూడంచెల భద్రత కల్పించినట్లు తెలిపారు. కౌంటింగ్‌ సందర్భంగా అభ్యర్థులకు, వారి ఏజెంట్లకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. ఏవైనా అభ్యంతరాలు లేదా సందేహాలు తలెత్తిన పక్షంలో వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శివేంద్రప్రతాప్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ రామిరెడ్డి, ఆర్‌డీఓ నవీన్‌, డీపీఓ వెంకట్‌ రెడ్డి, డీఈఓ ప్రవీణ్‌ కుమార్‌, మున్సిపల్‌ కమిషనర్లు, మాస్టర్‌ ట్రైనర్లు బాలు యాదవ్‌ బైకాని శ్రీకాంత్‌, నాగరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement