నల్లమల.. శివమయం
నల్లమలలో మార్మోగుతున్న శివనామస్మరణ
అచ్చంపేట: ఓం హరోం హరా..శంభో శంకరా..ఓం నమ!శివాయ.. అంటూ భక్తుల శిమనామస్మరణతో నల్లమల గిరులు మార్మోగుతున్నాయి. ఈనెల 8న ప్రారంభమైన శ్రీశైలేశుడి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు, మాలధారులు తరలి వస్తున్నారు. కొందరు కాలినడకన శ్రీగిరి చేరుకుంటుండగా.. మరికొందరూ వాహనాల్లో వస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో పాదయాత్రగా శ్రీశైలం వైపు అడుగులు వేస్తున్నారు. భక్తుల శివనామస్మరణతో నల్లమల అటవీ ప్రాంతం మార్మోగుతుంది. ముందుగా పాతాళగంగలో ఫుణ్యస్నానాలు అచరించి భ్రయరాంబ, మల్లికార్జునస్వామిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర నలుమూల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. కై లాసనాథుడిని దర్శించుకుని ఇరుముడులు, మొక్కులు చెల్లించుకుంటున్నారు.
అంతా శివమయం..
అష్టాదశ మహాశక్తి పీఠాల్లో ఒక్కటైన భ్రరాంబమహాశక్తి పీఠం స్వయంభుగా వెలిసిన శ్రీశైలం కొండలపై కొలువుదీరిన మల్లికార్జునస్వామిని దర్శించుకునేందుకు లక్షలాదిమంది భక్తులు తరలి వస్తున్నారు. ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి కావడంతో భక్తులు ఇప్పటికే చేరుకున్నారు. వారం రోజులుగా శ్రీశైలంలోని క్యూలైన్‌లన్నీ భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. అచ్చంపేట నియోజకవర్గంలోని హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారితోపాటు మహబుబ్‌నగర్–శ్రీశైలం ప్రధాన రహదారి పూర్తి గా శివభక్తులతో నిండిపోయింది. రవాణా సౌకర్యాలున్నా ధట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామసంకీర్తనలు చేసుకుంటూ కాలినడకన కొండలు, గుట్టులు, బండరాళ్లు, ముళ్లకంపలను అడ్డుతొలగించుకుంటూ శ్రీశైలం చేరకుంటున్నారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు, శివరాత్రి పురస్కరించుకుని ఉమ్మడి జిల్లాతోపాటు రంగారెడ్డి, హైదరాబాద్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కాలినడకన వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణం కోసం జిల్లా నుంచేకాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి బస్సులు నడిపించేందుకు ఏర్పాట్లు చేశారు. అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, షాద్‌నగర్ డిపోల నుంచి బస్సులు నడిపించనున్నారు. ఈనెల13నుంచి రెండు బస్సుల చొప్పున పెంచుకుంటూ ఈనెల 16వరకు ఏ రోజుకారోజు బస్సుల సంఖ్య పెంచుతూ శుక్రవారం, మహాశివరాత్రి ఆదివారం, మరుసటి రోజు సుమారు జిల్లా నుంచి 300లకుపైగా బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంది.
శ్రీశైలేశుడి చెంతకు
శివమాలధారుల పాదయాత్ర
అటవీదారి పొడవునా
వైద్యశిబిరాలు, అన్నదానాలు


