సలేశ్వరం.. జనసంద్రం | - | Sakshi
Sakshi News home page

సలేశ్వరం.. జనసంద్రం

Apr 2 2026 8:40 AM | Updated on Apr 2 2026 8:40 AM

ప్రత్యేక బస్సులు..

వైభవంగా లింగమయ్య ఉత్సవాలు ప్రారంభం

మొదటి రోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులు

తెలంగాణ అమర్‌నాథ్‌ దర్శనానికి క్యూ కట్టిన జనం

ఏటీఆర్‌ కోర్‌ ఏరియాలో మార్మోగిన

లింగమయ్య నామస్మరణ

దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగిన పలువురు భక్తులు

జాతర మొదటిరోజు బుధవారం అచ్చంపేట డిపో నుంచి 28, నాగర్‌కర్నూల్‌ నుంచి 25 ట్రిప్పులు బస్సులు నడిచాయి. పుల్లాయిపల్లి పెంట వరకు బస్సు సౌకర్యం ఉండగా.. అక్కడి నుంచి అటోల్లో మోకాళ్ల కురువ వరకు వెళ్లి కాలినడకన దర్శనం చేసుకుంటున్నారు. ఆటోలు సరిపడా లేక భక్తులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రాత్రివేళలో కూడా బస్సులను అనుమతించడంతో నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు సిద్ధంగా ఉన్నారు. గురువారం పౌర్ణమి రోజున భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో అందుకు అనుగుణంగా బస్సులు నడుపుతామని డీఎం మురళి ప్రసాద్‌ తెలిపారు.

అచ్చంపేట/అచ్చంపేటరూరల్‌: తెలంగాణ అమర్‌నాథ్‌గా ప్రసిద్ధిగాంచిన సలేశ్వరం లింగమయ్య ఉత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభయ్యాయి. పౌర్ణమి ముందురోజు వేలాది మంది భక్తులు మది నిండుగా లింగమయ్యను స్మరించుకుంటూ నల్లమల బాట పట్టారు. అటవీశాఖ బుధవారం నుంచి అనుమతిస్తామని చెప్పినప్పటికీ భక్తులు మంగళవారం సాయంత్రమే ఫర్హాబాద్‌ గేట్‌ వద్దకు చేరుకున్నారు. మండుతున్న ఎండను సైతం లెక్క చేయక పగటివేళ లింగమయ్య దర్శనానికి బారులు తీరారు. మొదటిరోజు సుమారు లక్ష మంది దర్శనం చేసుకున్నారు. మెట్లమార్గం, క్షేత్రంలో జనం కిక్కిరిసి ఉండటంతో చెప్పుల కుర్వ వద్ద పోలీసుశాఖ, వలంటీర్లు భక్తుల రాకపోకలను నియంత్రించారు. దీంతో చాలామంది పరిస్థితిని గమనించి లింగమయ్య దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ‘వస్తున్నాం.. లింగమయ్యా’ అంటూ చిన్నా పెద్దా తేడాలేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో రాళ్లు రప్పలు, లోయలు, గుట్టలు, సేలయేర్లను దాటుకుంటూ ఉత్సాహంగా ముందుకు కదిలారు. ఐదురోజుల జాతరను అటవీశాఖ మూడు రోజులకు కుదించడంతో పగలు, రాత్రి తేడాలేకుండా భక్తులు భారీగా తరలివస్తున్నారు. చెంచు పూజారులు లింగమయ్యకు గిరిజన సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఇరుకుగా ఉన్న కొండ దారుల్లో నడక సాగిస్తూ సలేశ్వరం జలపాతం వద్ద పర్యాటకులు స్నానాలు ఆచరించారు.

బైపాస్‌ రహదారులతో..

మన్ననూర్‌–ఫర్హాబాద్‌ నుంచి రాంపూర్‌పెంట వరకు వాహనాలు బారులు తీరాయి. ముందుస్తుగా పోలీసు, అటవీశాఖ వాహనాల రాకపోకల నియంత్రణకు వేర్వేరు దారులు ఏర్పాటు చేశాయి. వాహనాల పార్కింగ్‌కు మైదానం, అవసరమైన చోట చిన్న చిన్న బైపాస్‌ రహదారులు ఏర్పాటు చేశారు. మరో మార్గమైన అప్పాయిపల్లి–గిరిజన గుండాల కూడా భక్తజన సందోహంగా మారాయి. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అలసిన భక్తులు పొంచి ఉన్న ప్రమాదాలను లెక్క చేయకుండా చెట్లు, పుట్టలు, గుట్టల నడుమ సేద తీరుతున్నారు. ఆలయం, జలపాతం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా వలంటీర్లు సహకరిస్తున్నారు. వైద్య, ఆరోగ్యశాఖ అప్పాయిపల్లి, రాంపూర్‌ పెంట, సల్వేశ్వరం లోయ, ఫర్హాబాద్‌ వద్ద ప్రత్యేక వైద్యకేంద్రాలు ఏర్పాటు చేశారు. అంబులెన్స్‌లు సైతం అందుబాటులో ఉంచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement