మీసేవ చార్జీలు రెట్టింపు | - | Sakshi
Sakshi News home page

మీసేవ చార్జీలు రెట్టింపు

Apr 2 2026 8:40 AM | Updated on Apr 2 2026 8:40 AM

బుధవారం నుంచి అమల్లోకి..

జీఓ విడుదల చేసిన ప్రభుత్వం

వినియోగదారులకు అదనపు భారం

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): మీ సేవ రుసుం రెట్టింపయ్యింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఏప్రిల్‌ ఒకటో తేదీనుంచి పెరిగిన చార్జీలు అమల్లోకి వచ్చాయి. మీసేవ దరఖాస్తులకు గతంలో ఉన్న చార్జీలతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం వినియోగదారులను కలవరపెడుతుంది. మీసేవలో దరఖాస్తుల్లో ఏ, బీ కేటగిరీలు రెండురకాలు ఉండగా రెండింటిలోనూ చార్జీల పెంపు జరిగింది.

ఏ, బీ కేటగిరీలుగా విభజన

మీ సేవలో దరఖాస్తులను ఏ, బీ కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ–ఏ కింద వచ్చే దరఖాస్తులకు ఇది వరకు రూ.35 యూజర్‌ చార్జీ కాగా.. పెంచిన రేటు ప్రకారం రూ.62 కానుంది. కేటగిరీ–బీ కింద వచ్చే దరఖాస్తులకు ఇప్పటివరకు రూ.45 చెల్లిస్తుండగా.. రేపటి నుంచి రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. బిల్లుల చెల్లింపునకు సంబంధించిన రుసుం మూడు రకాలుగా ఉండనుంది. రూ.20గా ఉన్న చార్జీని రూ.35, రూ.25 ఉన్న చార్జీని రూ.45, రూ.30 ఉన్న చార్జీని రూ.58గా నిర్ణయించారు. విద్యుత్‌ బిల్లుల చెల్లింపు మొత్తానికి అనుగుణంగా మూడు రకాల యూజర్‌ చార్జీలు పెంచారు. గతంలో రూ.2 ఉన్న చార్జీని రూ.4, రూ.5 ఉన్న చార్జీని రూ.9, రూ.10 ఉన్న చార్జీని రూ.18. రూ.25 ఉన్న చార్జీని రూ.44కి పెంచారు. యూజర్‌ చార్జీల పెంపు ఒకేసారి రెట్టింపు చేయడం.. దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం భారంగా మారుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు రోజులు అంతరాయం

సర్వర్‌ నిర్వహణ పనుల నేపథ్యంలో మీ సేవ ఆన్‌లైన్‌ సేవలకు తాత్కాలిక అంతరాయం ఏర్పడనున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. ఏప్రిల్‌ 3 సాయంత్రం 5గంటల నుంచి 5 ఉదయం 8 గంటల వరకు నిర్వహణ పనులు కొనసాగనున్నట్లు తెలిపారు. సర్వర్‌ పనితీరు మెరుగుదల, భద్రతా వ్యవస్థల అప్‌గ్రేడ్‌, సాంకేతిక సమస్యల నివారణకు ఈ పనులు చేపడుతున్నారు. ఈ సమయంలో సంబంధిత విభాగాలకు చెందిన ఆన్‌లైన్‌ సేవలు, డిజిటల్‌ లావాదేవీలు, వెబ్‌ పోర్టల్‌ సేవలు తాత్కాలికంగా పనిచేయవని, ప్రజలు అత్యవసర సేవలను ముందుగానే వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. నిర్వహణ పూర్తయిన అనంతరం సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని తెలిపారు. సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించడంలో భాగంగానే ఈ చర్యలు చేపడుతున్నామని, భవిష్యత్‌లో వేగవంతమైన, అంతరాయంలేని సేవలను అందించేందుకు ఈ నిర్వహణ ఉపయోగపడుతుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement