కొత్తపల్లి: మండల పరిధిలోని తిమ్మారెడ్డి పల్లిలో వెలసిన గిరిజనుల ఆరాధ్య దైవం గురులోకా మసంద్ ప్రభు ఉత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం బంజాన భజనలతో స్వామి వారికి ప్రభోత్సవం నిర్వహించారు. అనంతరం వంశపార పర్య పూజారులు చందర్ నాయక్, దేవ్లానాయక్, బీంమ్లానాయక్, దన్‌సింగ్ ఆధ్వర్యంలో గురులోకా మసంద్ ప్రభు బావాజి, కాళికాదేవి ఆలయాల్లో ధ్వజా రోహణం నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
రాష్ట్ర పండుగ గుర్తింపుపై గిరిజనుల హర్షం
గురు లోకామసంద్ ప్రభు బావాజీ జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ జీఓ విడుదల చేసింది. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద గిరిజన జాతర బావాజి జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో సీఎం రేవంత్‌రెడ్డి చిత్ర పటానికి ఆలయ కమిటీ సభ్యులతో పాటు జాతరకు హాజరైన భక్తులు క్షీరాభిషేకం చేశారు. ఈ గిరిజన జాతరకు కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, చత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ నుంచి వేలాదిగా వచ్చే గిరిజనులను గుర్తించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతకు ముందు జాతర ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన కొడంగల్ నియోజకవర్గ కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, నారాయణపేట జిల్లా ఆర్‌డీఓ రాంచందర్, తహసీల్దార్ జయరాములు ఆలయ ప్రాంగణంలో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రత్యేక జీఓను కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కాడా ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


