ఓపీఎస్‌లకు కష్టకాలం
ఉన్నతాధికారులకు
వివరించాం..
ఉత్తర్వుల
జారీలో జాప్యం..
బిల్లులు చేయడంలో నిర్లక్ష్యం
ఎన్నికల వేళ పరేషాన్..
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామ పాలనను చక్కదిద్దడంతోపాటు గ్రామాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా వంటి పనులు సాఫీగా సాగాలంటే పంచాయతీ కార్యదర్శి కీలకం. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ.. గ్రామపాలన సజావుగా సాగేలా పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు కష్టకాలంలో ఉన్నారు. నెలలు గడుస్తున్నా చేతికి వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పంచాయతీ ఖజానాల్లో చిల్లిగవ్వ లేక, మరోవైపు నెలల తరబడి వేతనాలు అందకపోవడంతో పడరాని పాట్లు పడుతున్నారు. చిన్నపాటి సమస్యలను పరిష్కరించేందుకు వడ్డీలకు అప్పులు చేస్తూ నెట్టుకొస్తున్నారు. దీనికితోడు రెగ్యులర్ కార్యదర్శులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా.. వారి సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులకు ప్రతినెలా 1న వేతనాలు అందిస్తుండగా.. ఔట్ సోర్సింగ్ కార్యదర్శులకు మాత్రం ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్నాయి. ఇందులో వింత ఏమిటంటే 2024 ఫిబ్రవరి, మార్చి నెలలు, 2025 ఏడాదిలోని ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలతోపాటు సెప్టెంబర్ నుంచి జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలో 33 మంది ఓపీఎస్‌లు పనిచేస్తున్నారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సర్వీసు కొనసాగింపు ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఇది ఓపీఎస్‌ల పాలిట శాపంగా మారింది. వేతనాల చెల్లింపు బడ్జెట్ విడుదలైనా సర్వీస్ కొనసాగింపు ఉత్తర్వులు రాని కారణంగా ట్రెజరీ అధికారులు వేతనాలు చెల్లించేందుకు నిరాకరించారు. ఎట్టకేలకు ప్రభుత్వం సర్వీస్ కొనసాగింపు ఉత్తర్వులు విడుదల చేసినా.. ఓపీఎస్‌లకు ప్రస్తుతం వేతనాలు అందించలేని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్నేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో వేలాది మంది బోగస్ ఉద్యోగులు పనిచేస్తున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది. ఉద్యోగుల ఆధారడ్డ్‌ను ఐడీకి అనుసంధానం చేసింది. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న కార్యదర్శులకు ఎంప్లాయ్ ఐడీ లేకపోవడంతో ట్రెజరీలో వీరికి వేతనాలు చెల్లించడం సాధ్యం కావడం లేదు. వేతనాల చెల్లింపు కోసం అధికారులు సాఫ్ట్‌వేర్‌లో వివరాలు నమోదు చేసే క్రమంలో ఎంప్లాయ్ ఐడీ అడుగుతోంది. దీంతో బడ్జెట్ ఉన్నా వేతనాలు అందుకోలేని పరిస్థితిలో ఓపీఎస్‌లు ఉన్నారు.
ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల జీతాలు పెండింగ్‌లో ఉన్నమాట వాస్తవమే. వీరి జీతాల గురించి ఉన్నతాధికారులకు వివరించాం. జీతాలు ఏజెన్సీ ద్వారా విడుదలవుతాయి. ఎంపీడీఓ స్థాయిలో వారి బిల్లులు చేయాల్సి ఉంటుంది. వారి స్థాయిలో ఏమైనా సమస్య ఉంటే సరిచేసి జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
– వెంకట్‌రెడ్డి, ఇన్‌చార్జి డీపీఓ
ఆర్థిక ఇబ్బందుల్లో
కొట్టుమిట్టాడుతున్న కార్యదర్శులు
తలకు మించిన భారంగా
ఎన్నికల నిర్వహణ ఖర్చులు
శాపంగా మారిన డీపీఓ, ఎంపీడీఓ
అధికారుల మధ్య సమన్వయలోపం
ఎనిమిది నెలలుగా అందని వేతనాలు
ఎంపీడీఓ కార్యాలయ అధికారులు డీపీఓ కార్యాలయంలో అధికారుల మధ్య సమన్వయ లోపం ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులకు శాపంగా మారింది. ఎంపీడీఓ కార్యాలయంలో వీరికి చెందిన జీతాల బిల్లులు చేయడంలో నిర్లక్ష్యం వహించడంతో ఈ జాప్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. దీనికి తోడు డీపీఓ కార్యాలయంలో వీరికి జీతాలు ఇస్తున్నారా.. లేదా అని ఏమాత్రం సమాచారం ఉండదు. వీరిని పట్టించుకునే వాళ్లు లేనట్లుగా వారి వ్యవహారం ఉంటుందని వాపోతున్నారు.
పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు మొత్తం చూసుకున్న కార్యదర్శులు నిధులు లేకపోవడంతో సొంతంగా ఖర్చు చేశారు. అయితే రెగ్యులర్ కార్యదర్శులకు ప్రభుత్వం ప్రతినెలా వేతనాలు చెల్లిస్తుండటంతో వారికి కాస్త ఊరట లభించింది. జీతంలో నుంచి ఎన్నికల నిర్వహణ ఖర్చులను భరించారు. కానీ, ఓపీఎస్ పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. నెలల తరబడి వేతనాలు అందక కుటుంబ పోషణే భారంగా మారుతున్న తరుణంలో ఎన్నికల నిర్వహణ ఖర్చులు తలకు మించిన భారమయ్యాయి. ఎన్నికల అధికారులు, పోలీస్, పంచాయతీ సిబ్బందికి భోజనాలు, టీ ఖర్చులతోపాటు ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం, సిబ్బంది భోజనాలు, ఇతర వసతుల కోసం ఒక్కో పంచాయతీలో కనీసం రూ.20 వేల వరకు ఖర్చు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఓపీఎస్‌లు అప్పులు చేసి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు చేపట్టారు.
ఓపీఎస్‌లకు కష్టకాలం


