రాజకీయ అవసరాలకే ‘పాలమూరు’ పేరు
పాలమూరు: పాలమూరు జిల్లా ప్రాజెక్టులను రాజకీయ అవసరాల కోసమే వాడుకుంటున్నారని ఎంపీ డీకే అరుణ అన్నారు. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. జిల్లాకేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జూరాల అప్రోచ్ వద్ద ఉన్న పాలమూరు– రంగారెడ్డిని అప్పటి సీఎం కేసీఆర్ నార్లాపూర్‌కు మార్పు చేసి ప్రాజెక్టు రూపురేఖలు మార్చారన్నారు. అక్కడే కుర్చీ వేసుకుని మూడేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణమ్మ నీళ్లతో పాలమూరు రైతుల కాళ్లు కడుగుతానని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టారని దుయ్యబట్టారు. డీపీఆర్ కేంద్రం వెనక్కి పంపిందని బీజేపీపై బట్టకాల్చి వేస్తున్నారని ఆరోపించారు. కృష్ణానది నీటిని పాలమూరు– రంగారెడ్డి జిల్లాలకు మాత్రమే సాగు, తాగునీటికి ఇవ్వాలని, డిండి ద్వారా నల్లగొండకు నీళ్లు తీసుకువేళ్లే ప్రయత్నం మానుకోవాలన్నారు. పాలమూరు ఎమ్మెల్యేలు ఈ అంశంపై నోరు విప్పకపోతే జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఒకే పేరుతో పది మంది ఓటర్లున్నా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది.. కానీ, నగర, పట్టణ ప్రాంతాల్లో అలాంటి వారిని గుర్తించడం కష్టమవుతుంది కాబట్టి.. డ్రాప్ట్ ఓటరు జాబితా ఫొటోలతో ప్రచురించాలని డిమాండ్ చేశారు. ఓటరు జాబితాల్లో అనేక తప్పులు ఉన్నాయని, అనేక డివిజన్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నందున సదరు తప్పులు సరి చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.
● కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లా కార్యాలయంలో ముఖ్య నేతలతో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడారు. డ్రాప్ట్ ఓటరు జాబితాలోని పొరపాట్లను ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నేతలు అందరూ కలిసి మున్సిపాలిటీ ఎన్నికల కోసం టీంవర్క్ చేసి.. పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలన్నారు. వార్డుల వారిగా నేతలు బాధ్యత తీసుకొని పనిచేయాలని, మున్సిపాలిటీ వారిగా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు నిర్వహించాలన్నారు. గెలుపు అవకాశాలు, ఇతర సమీకరణాలు దృష్టిలో పెట్టుకుని పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తుందని, పార్టీ ఎవరిని అభ్యర్థిగా పోటీలో నిలిపిన గెలుపు కోసం పని చేయాలని సూచించారు. ప్రధానంగా మైనార్టీలను పార్టీలోకి ఆహ్వానించి కేంద్రం ఎలాంటి బేధం లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తుందని, పార్టీ నుంచి పోటీ చేయాలని ఆసక్తి ఉండే మైనార్టీలను ప్రోత్సహించాలన్నారు. ఆయా సమావేశాల్లో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాండురంగారెడ్డి, బ్రహ్మచారి, సుదర్శన్‌రెడ్డి, నర్సింహులు, కృష్ణవర్ధన్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ డీకే అరుణ విమర్శ


