అంధులు బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలి
మహబూబ్‌నగర్ రూరల్: స్పర్శ ద్వారానే అక్షర జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునే మార్గాన్ని కనిపెట్టి అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ అని కలెక్టర్ విజయేందిర అన్నారు. లూయిస్ బ్రెయిలీ 217వ జయంతిని పురస్కరించుకొని ఆదివారం జిల్లాకేంద్రంలోని మెట్టుగడ్డలో గల శిశుగృహ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంధుల కోసం ప్రత్యేకంగా లిపిని సృష్టించి వారి జీవితంలో వెలుగులు నింపిన మహనీయుడు లూయిస్ బ్రెయిలీ అని, అంధులు బ్రెయిలీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. లూయిస్ స్ఫూర్తితో ఎంతోమంది అంధులు జీవితంలో ఎన్నో మైలురాళ్లను దాటారన్నారు. అంధులు సామాన్యులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా ఆలోచించి లూయిస్ బ్రెయిలీ ఆరు చుక్కలతో కూడిన లిపిని తయారు చేశారని పేర్కొన్నారు. జిల్లా యంత్రాంగం ప్రతినెలా మొదటి బుధవారం దివ్యాంగులు, సీనియర్ సిటిజన్‌లకు ప్రత్యేక ప్రజావాణి నిర్వహిస్తుందని వివరించారు. ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ జరీనాబేగం, అంధుల పాఠశాల హెచ్‌ఎం రాములు, డాక్టర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.


