ముంపు బాధితులకు న్యాయం చేస్తాం
చారకొండ: మండలంలోని గోకారంలో నిర్మించే రిజర్వాయర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చినట్లు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి తెలిపారు. రిజర్వాయర్ సామర్థ్యం తగ్గించాలని కోరుతూ ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా నిర్వాసితులు ప్రకాష్, పెద్దయ్య పర్వతాలు, నాయకులు సాంబయ్యగౌడ్, ఇతర నాయకులు శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎంపీ మల్లు రవి నివాసాల్లో వారిని వేర్వేరుగా కలిసి వినతిపత్రం అందించారు. దీంతో అంసెబ్లీ పాయింట్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా ముంపు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను వివరించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందిస్తూ ప్రజలకు నష్టం జరగకుండా రీఅలైన్‌మెంట్ చేయించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చినట్లు వారు తెలిపారు.
‘నిర్వాసితులను విస్మరించొద్దు’
డిండి–నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చారకొండ మండలంలోని గోకారం జలాశయం సామర్థ్యం తగ్గించే వరకు పోరాటం చేస్తామని ఎర్రవల్లి, ఎర్రవల్లితండా నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రవల్లిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 33వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని సర్పంచ్ ఎన్నికలు సైతం బహిష్కరించినా తమ గోడును ఎందుకు పట్టించుకోవడం లేదని వాపోయారు.
ముంపు బాధితులకు న్యాయం చేస్తాం


