వామ్మో.. రక్తపింజర
జడ్చర్ల టౌన్: రాజాపూర్ సమీపంలోని కుమ్మరి వెంకటేశ్ నీటికుంటలో శనివారం ఐదున్నర అడుగుల ఆడ రక్తపింజర కనిపించింది. గుర్తించిన రైతు సర్ప రక్షకుడు సదాశివయ్యకు సమాచారం ఇచ్చారు. ఆయన తన శిష్యులైన భరత్, అభిలాష్‌ను పంపించగా వారు చాకచక్యంతో నీరు ఖాళీచేసి పట్టుకున్నారు. సాధారణంగా రాళ్లు, ఇటుకలు, ఎలుకలు ఉండే ప్రాంతం, వరి పొలాల్లో ఎక్కువగా ఇలాంటి సర్పాలుంటాయని.. నవంబర్, డిసెంబర్‌లో చలి ఎక్కువగా ఉండటం, ప్రత్యుత్పత్తి కాలం కావడంతో బయటకు వస్తాయని వారు తెలిపారు. ఈ క్రమంలో ఇళ్లు, కల్లాలు, నీటిగుంతల్లోకి చేరుతాయని చెప్పారు.
రెండు నెలల్లో..
జడ్చర్ల పరిసరాల్లో నవంబర్, డిసెంబర్‌లో మొత్తం 31 రక్తపింజరలు పరిరక్షించినట్లు డా. సదాశివయ్య తెలిపారు. మగవి 6 అడుగులు, ఆడవి ఐదున్నర అడుగల పొడువున్న వాటిని పట్టుకున్నట్లు చెప్పారు. ఇవి కొండచిలువను పోలి ఉంటాయని.. నెమ్మదిగా ఉన్నట్లు కనిపించినా వాయువేగంతో ఎగురుతూ వచ్చి కాటు వేస్తాయని వివరించారు. ఒక్కసారి కాటు వేస్తే 16 మందిని చంపగలిగే విషాన్ని విడుదల చేస్తాయని, ప్రాణాలు త్వరగా పోతాయని చెప్పారు. ఈ పాములు నలుపు, గోధుమరంగు మచ్చలు కలిగి ఉంటాయని.. కనబడితే సెల్‌నంబర్ 99635 36233 సమాచారం ఇవ్వాలని కోరారు.


