సావిత్రిబాయి స్ఫూర్తితో విద్యాభివృద్ధికి కృషి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): విద్యారంగంలో జిల్లాను మరింత మెరుగుపరిచి ముందంజలో నిలిపేందుకు సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన సావిత్రిబాయిపూలే జయంతి కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించినట్లు చెప్పారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో 52 శాతం మంది మహిళలు, 58 శాతం బాలికలు చదువుతున్నారని, ప్రభుత్వ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు చెప్పారు. ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ వారు మరింత అంకితభావంతో పనిచేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను ఇంకా మెరుగుపరిచి.. విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషిచేయాలన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యా శాఖ ద్వారా ఎంపిక చేసిన పాఠశాలలకు చెందిన 17 మందికి ఉత్తమ మహిళా ఉపాధ్యాయ అవార్డులు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో డీఈఓ ప్రవీణ్‌కుమార్, డీపీఆర్‌ఓ శ్రీనివాస్, ట్రెయినీ డీపీఓ నిఖిల, డీఎంహెచ్‌ఓ కృష్ణ, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఇందిర, గిరిజన అభివృద్ధి అధికారి జనార్దన్, ఉద్యానవన అధికారి వేణుగోపాల్, ఏఎంఓ శ్రీనివాస్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


