వైద్య సిబ్బందిపై ఆగ్రహం
భూత్పూర్: వైద్య సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహించొద్దని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఆస్పత్రి సిబ్బంది ఉదయం 10.30 గంటలైనా విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్టోర్ రూంతోపాటు కుక్కకాటు, పాముకాటు మందుల వివరాలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట తహసీల్దార్ కిషన్, ఆర్‌ఐ వెంకటేష్ తదితరులున్నారు.


