భత్యంపై ఉద్యోగుల అసంతృప్తి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం కాకుండా తక్కువ భత్యం చెల్లించడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్నికల విధులను సజావుగా నిర్వహించిన తమకు సరైన టీఏడీఏ చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో మూడు విడుతల్లో ఎన్నికలు జరగగా.. మొత్తం 3,674 పోలింగ్ కేంద్రాల్లో 9,610 మంది ఉద్యోగులు వివిధ హోదాల్లో ఎన్నికల బాధ్యతలు నిర్వర్తించారు. స్టేజ్–1 రిటర్నింగ్ అధికారిగా ఎనిమిది రోజుల పాటు విధులు నిర్వహించినందుకు రోజుకు రూ.500 చొప్పున రూ.4 వేలు చెల్లించాల్సి ఉంది. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు ఏడు రోజుల విధులకు గాను రూ.3,500, రిటర్నింగ్ అధికారి స్టేజ్–2 వారికి రూ.4 వేలు, ప్రిసైడింగ్ అధికారికి రూ.2,500, పోలింగ్ అధికారులకు రూ.1,300 భత్యం చెల్లించాలని ఎన్నికల సంఘం ఆయా జిల్లాల అధికార యంత్రాంగానికి ఆదేశాలను జారీచేసింది. కానీ, ఎక్కడైనా రూ.2 వేలు మాత్రమే భత్యం చెల్లించి అధికారులు చేతులు దులుపుకొన్నారని ఉద్యోగులు వాపోతున్నారు. ఎన్నికల భత్యం తక్కువగా చెల్లించడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు తమ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు చేస్తూ చర్చ కొనసాగిస్తున్నారు. మొదటి దశ పోలింగ్ సిబ్బందికి రూ.2,500 చొప్పున భత్యం చెల్లించగా, రెండో విడతలో రూ.1,500కే పరిమితం చేశారు. మూడో విడతలో గొడవ చేస్తారనే ఉద్దేశంతో రూ.2 వేల చొప్పున భత్యం చెల్లించారని తెలుస్తోంది. ఈ విషయమై ఉద్యోగులు పంచాయతీ అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం లేదని పలువురు ఉద్యోగులు వెల్లడించారు. ఎన్నికల సంఘం సూచించే భత్యం ఒకలా ఉంటే అధికారులు చెల్లించే భత్యానికి తేడా ఉందన్నారు. అసలు ఈ నిధులు ఎటు వెళ్తున్నాయని ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఇన్‌చార్జి డీపీఓ, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డిని సంప్రదించగా బిల్లులు ప్రభుత్వానికి పెట్టామని, మంజూరైతే చెల్లిస్తామని పేర్కొన్నారు.


