బీసీ బిల్లు ఆమోదం తర్వాతే ఎన్నికలకు వెళ్లాలి
అమరచింత: అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ బిల్లును తీర్మాణం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపినా ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపకపోవడం దారుణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మండల కేంద్రంలోని జీఎస్ భవన్‌లో శుక్రవారం ఆయా గ్రామాల్లో సీపీఎం పార్టీ మద్దతుతోపాటు ఒంటరిగా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన ప్రజా ప్రతినిధులను ఆయన సన్మానించారు. ఈసందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని, అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి కేంద్రం ఆమోదం కోసం పంపి నెలలు కావస్తున్నా ఫైల్ పెండింగ్‌లో పెట్టడం సరైంది కాదని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ పంపిన బిల్లులను ఒకే రోజులో క్లియర్ చేస్తున్నారని, కానీ బీసీల 42 శాతం బిల్లును మాత్రం అమలు చేయించడంలో బీజేపీ శ్రద్ద చూపడం లేదని దుయ్యబట్టారు. రానున్న మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వరకై నా బీసీలకు కల్పించిన రిజర్వేషన్ అమలు తర్వాతే ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ బిల్లు అమలు కోసం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి, ప్రధాని వద్దకు సీఎం తీసుకెళ్లాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతున్నాయని, ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తు గద్దె నెక్కుతున్న రోజులు వస్తున్నాయని వీటిని అరికట్టడంతో ఎన్నికల కమిషనర్ తన బాధ్యతలను విస్మరిస్తుందన్నారు. రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో సీపీఎం ప్రజా పక్షాన ఉంటూ ఎన్నికల బరిలో నిలుస్తుందని, మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి చైర్మన్ స్థానాలను సీపీఎం కై వసం చేసుకునేలా పార్టీ కార్యకర్తలు సైనికులుగా మారాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మహమూద్, మాజీ వైస్ చైర్మన్ జీఎస్.గోపి, వెంకటేష్, అజయ్,రాఘవేంద్ర, విష్ణు, ఎస్‌ఈ శ్యాంసుందర్,దేవర్ల మోహన్, సర్పంచ్ కుర్వ బాలయ్య, ఉప సర్పంచ్ వెన్నెల పాల్గొన్నారు.


