సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో జిల్లా ఉద్యోగులు చేస్తున్న కృషి అభినందనీయం అని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం ఆమె చాంబర్‌లో టీఎన్‌జీఓ యూనియన్ నాయకులు కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్‌జీఓ యూనియన్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. అలాగే ఈ సంవత్సరంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, కలెక్టరేట్ ఏఓ సువర్ణరాజ్, టీఎన్‌జీఓ జిల్లా అధ్యక్షుడు రాజీవ్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రనాయక్, అసోసియేట్ అధ్యక్షుడుం శ్యాంసుందర్‌రెడ్డి, కోశాధికారి కృష్ణమోహన్, ఉపాధ్యక్షులు వెంకట్‌రాంరెడ్డి, నందకిషోర్, సహ కార్యదర్శి ప్రియాంక, పట్టణ అసోసియేట్ అధ్యక్షుడు అనిల్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు సుభాష్‌చంద్రబోస్, సహాయ కార్యదర్శి చక్రపాణి, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షుడు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
రైతులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
రాజాపూర్: వివిధ పనులపై తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే పనులు పూర్తిచేయాలని కలెక్టర్ అన్నారు. రాజాపూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముఖ్యంగా 22ఏకు సంబంధించిన ప్రభుత్వ భూములు, ప్రొహిబిటెడ్ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకు ముందు కలెక్టర్ విజయేందిర, ఆర్డీఓ నవీన్‌కుమార్‌కు తహసీల్దార్ రాధాకృష్ణ మొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ భారతి, ఆర్‌ఐలు యాదయ్య, మంజుల తదితరులు పాల్గొన్నారు.


